Dr BR Ambedkar Gurukulam Madhurawada: మీ పిల్లలకు క్రమశిక్షణ, సమయపాలన, చదువుపై ఆసక్తి కలిగించే బోధనతో పాటు ప్రత్యేక తరగతులు, ఆటపాటలు, స్నేహితులతో సరదాలు, ఉత్తమ ఫలితాలు ఇలా అన్నింటినీ అందిస్తోంది ఈ గురుకలం. అదే మధురవాడ రిక్షా కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రతిభ పాఠశాల, కళాశాల. 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బాలికలు చేరేందుకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ: 5వ తరగతి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ల కోసం apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మార్చి 6వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు అప్లికేషన్లను పంపించాలి. విద్యార్థినులు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోతో పైన ఇచ్చిన వెబ్‌సైటులో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం విశాఖ జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2024-25 సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
విద్యార్థినులు 01-09-2012 నుంచి 31-08-2016 మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్లో చేరేందుకు 2024-25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ పద్ధతిలో విద్యను అభ్యసించి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2025 ఆగస్టు 31వ తేదీ నాటికి 17 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఆదాయ పరిమితి లక్ష రూపాయలు మించి ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు ఏప్రిల్ 6వ తేదీన ఎంట్రీ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఈ గురుకులంలో సౌకర్యాలు ఇవే:
- విద్యార్థినికి భోజనం, వసతితోపాటు ఏడాదికి 4 జతల దుస్తులు ఇస్తారు.
- అవసరమైన పుస్తకాలు, ట్రంకు పెట్టె, ప్లేటు, గ్లాసు, బెడ్, పాదరక్షలు, ఇతర సామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తారు.
- ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యని అందిస్తారు.
- శాస్త్ర, సాంకేతిక పరిశోధనల వైపు విద్యార్థినులను మళ్లించేందుకు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో పరిశోధనలు చేపిస్తారు.
- ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఐఐటీ, నీట్, జేఈఈ, ఎంసెట్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- డిజిటల్ బోధన, వర్చువల్ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్ బోధన ఇక్కడ ప్రత్యేకం.
ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే: (రిజర్వేషన్ల ప్రకారం):
- 5వ తరగతిలో - 80 సీట్లు
- ఇంటర్ (ఎంపీసీ) - 40 సీట్లు
- ఇంటర్ (బైపీసీ) - 40 సీట్లు
విలువలతో కూడిన విద్య: అంబేడ్కర్ గురుకులంలో విలువలతో కూడిన విద్యనందిస్తున్నామని ప్రిన్సిపల్ డి.శాంతకుమారి తెలిపారు. చదువుతో పాటు స్పోర్ట్స్, సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. అప్లై చేసుకునేందుకు బాలికలు తమ గురుకులానికి వస్తే స్వయంగా సిబ్బందే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి సహకరిస్తారన్నారు. ఇలాంటి సాయం కోరుకునే వారు అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు.