AP State Budget 2025: సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూల ధనవ్యయం పెంచే విధంగా బడ్జెట్‌నూ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారని సమాచారం. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల అసెంబ్లీలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూ.3.20 లక్షల కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బేటీ కానుంది. అనంతరం 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందుంచనున్నారు.
శాసన మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. 2025 ఏప్రిల్ 1 తేదీ నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ.3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్ధిక సాయంగా అన్నదాత సుఖీభవ, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తద్వారా 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్టు సమాచారం. పేదలతో పాటు మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యతరగతిపై పన్నులు, కరెంటు ఛార్జీల భారం లేకుండా చూసేలా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు సమాచారం. వీటితో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చే అంశంతో పాటు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేలా సీఎఫ్ఎంఎస్ ఖాతాల నుంచి స్థానిక సంస్థల పీడీ ఖాతాలను డీలింక్ చేసే అంశంపై కూడా బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
అలాగే ఉపాధి అవకాశాలను పెంచేలా వివిధ పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారివారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కోటి రూపాయల చొప్పున కేటాయించేందుకూ ఆస్కారం ఉన్నట్టు సమాచారం. అటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రతి జిల్లా కలెక్టర్ ఆధీనంలోనూ కోటి రూపాయల చొప్పున ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఆర్ధిక మంత్రి తన బడ్జెట్లో పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీలేని రుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో పేర్కొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రీడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది.
మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు - ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు : పవన్ కల్యాణ్