67th National Maize Conference in Hyderabad : భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి, గోధుమల తర్వాత మూడో ప్రధాన పైరు మొక్కజొన్న. ఆహారం, ఫీడ్, పశుగ్రాసం, పెద్ద సంఖ్యలో పారిశ్రామిక ఉత్పత్తుల ముడి పదార్థంగా బహువిధ వినియోగానికి అత్యంత విలువైందిగా నిలుస్తోంది. 2005 నుంచి భారతదేశం 9.89 మిలియన్ హెక్టార్లలో మొక్కజొన్న సాగు ద్వారా విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించే చర్యల్లో భాగంగా ఇథనాల్ ఉత్పత్తిపై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరిగిన 67వ జాతీయ మొక్కజొన్న సదస్సు విజయవంతంగా ముగిసింది.
దేశంలో సాగుకు అనుకూలమైన రాష్ట్రాల్లో మొక్కజొన్న సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పతాదకత పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలు, పరిశోధనలు, నూతన పంట రకాలు, సంకర జాతి వండగాల సృష్టి వంటి అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ వాతావరణ మార్పులని తట్టుకునే వంగడాల సాయంతో మొక్కజొన్న ఉత్పత్తి, ఉత్పాదకత అధికం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
"మొక్కజొన్న సాగు ప్రధానంగా పెరిగే అవకాశం ఉంది. రోజురోజుకు నీటి వనరులు తగ్గుతున్నాయి. ఒక ఎకరాలో వరిని పండించే బదులు మూడు ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేయవచ్చు. దేశవ్యాప్తంగా మొక్కజొన్నపై పరిశోధనలు జరుగుతున్నాయి." - డాక్టర్ ధరావత్ భద్రు, మొక్కజొన్న ప్రధాన శాస్త్రవేత్త
2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ : దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో 47 శాతం కోళ్ల దాణా కోసం పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగిస్తున్నారు. మరో 13 శాతం పశుగ్రాసానికి వెళ్తోంది. స్టార్చ్ పరిశ్రమ మొక్కజొన్నలో దాదాపు 14 శాతం వినియోగిస్తోంది. దశాబ్దాలుగా మొక్కజొన్నను ప్రత్యక్ష ఆహారంగా ఉపయోగించడం గణనీయంగా తగ్గగా, ఇటీవల 13 శాతం పెరిగింది. స్వీట్ కార్న్, బేబీ కార్న్, పాప్‌కార్న్ రూపంలో దీని వాడకం ఇటీవల గణనీయంగా పెరిగింది. పౌల్ట్రీ డిమాండ్‌తో పాటు 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయించిన దృష్ట్యా ప్రస్తుతం ఉన్న వార్షిక ఉత్పత్తి మరింత పెంచాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
"2025 ఏడాది లోపు దేశంలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్ ఉపయోగించడానికి ముఖ్యమైన ప్రతిపాదన. దానిలో భాగంగా వివిధ పంటలను తీసుకుంటే చెరకు, వరిని ఉపయోగిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వాడడానికి ముఖ్యమైన ముడి సరకుగా వాడడం జరుగుతుంది. రాబోయే 20 లేదా 30 సంవత్సరాల్లో ఇథనాల్ శాతాన్ని 30 శాతం పెంచాలంటే మొక్కజొన్న సాగును పెంచాలి." - డా.నరేశ్‌కుమార్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం, పీజేటీఎస్ఏయూ అధిపతి
E20 పెట్రోల్ : పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించే పెట్రోలును 'E20'గా పరిగణిస్తారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 'E20' పంపులు అందుబాటులోకి రానుంది. 2023 ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈ పంపులు ప్రారంభించారు. ఇప్పటిదాకా 750 పైగా E20 పంపులు అందుబాటులోకి రాగా, మరో రెండేళ్లలో అన్ని ప్రాంతాల్లో విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2013-14లో పెట్రోల్‌లో ఇథనాల్ వాటా 1.53 శాతం నుంచి గత ఏడాది మార్చి నాటికి 11.5 శాతానికి పెరిగింది.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారత్ మూడో అతిపెద్ద చమురు, మూడో అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా నిలుస్తోంది. సహజ వాయువు దిగుమతులు, జీహెచ్జీ ఉద్గారాలు, వ్యవసాయ అవశేషాలులను కాల్చడం తగ్గించడం, రైతులకు లాభదాయక ఆదాయం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికనగుణంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.