100 Runs In Three Overs : క్రికెట్ చరిత్రలో నేటికీ చెక్కు చెదరని రికార్డులు కొన్ని ఉన్నాయి. ఈ తరం క్రికెటర్‌లకి వాటిని అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ లిస్టులో లెజెండరీ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డు ఒకటుంది. ఒకప్పుడు ఆయన కేవలం మూడు ఓవర్లలో 100 బాదేశాడు. నమ్మబుద్ది కావడం లేదా! కానీ అది నిజం. ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతను బ్రాడ్‌మన్ సొంతం చేసుకున్నాడు. 1931లో న్యూ సౌత్‌వేల్స్‌లోని బ్లూ మౌంటైన్స్ ప్రాంతంలో బ్లాక్‌హీత్ వర్సెస్ లిత్‌గో డొమెస్టిక్ మ్యాచ్‌లో ఈ సంచలనం జరిగింది. అయితే అప్పట్లో ఒక ఓవర్‌కి ఎనిమిది బంతులు ఉండేవట.
మ్యాచ్‌లో విధ్వంసం
బ్లాక్‌హీత్ తరఫున ఆడిన బ్రాడ్‌మన్ (23) మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. బిల్బ్లాక్ అనే బౌలర్ వేసిన మొదటి ఓవర్‌లో 33 పరుగులు చేశాడు. ఓవర్ ప్రారంభమయ్యే ముందు లిత్‌గో వికెట్ కీపర్ లియో వాటర్స్ బ్రాడ్‌మన్‌కి ఓ మాట చెప్పి తప్పు చేశారు. కొన్ని వారాల క్రితం బ్రాడ్‌మన్‌ని బిల్ బ్లాక్ ఔట్ చేశాడని గుర్తుచేశాడు. దీంతో ఆస్ట్రేలియన్ లెజెండ్ రెచ్చిపోయారు. ఆ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 2, 4, 4, 6, 1 బాదేశాడు.హోరీ బేకర్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఎనిమిది బంతుల్లో ఏకంగా 40 పరుగులు పిండుకున్నాడు.
6, 4, 4, 6, 6, 4, 6, 4తో అన్ని బంతులను బౌండరీ దాటించేశారు. తరువాతి ఓవర్ బౌలింగ్ చేయడానికి బ్లాక్ తిరిగి వచ్చాడు. బ్రాడ్‌మన్ పార్ట్‌నర్ వెండెల్ బిల్ క్రీజులో ఉన్నాడు. మొదటి బంతికి సింగిల్ తీసి బ్రాడ్‌మన్‌కి స్ట్రైక్ ఇచ్చాడు. ఆ ఓవర్‌లో వరుసగా 1, 6, 6, 1, 1, 4, 4, 6 వచ్చాయి. బ్రాడ్‌మన్ 27 పరుగులు చేశాడు. మూడు ఓవర్లు ముగిసే సమయానికి బ్రాడ్‌మన్ 100 పరుగులు చేశాడు.
క్రికెట్ చరిత్రలో ఇదో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. బ్రాడ్‌మన్ చివరికి 256 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ గొప్పతనం నేటి క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియదు. వీడియో ఫుటేజీ లేకపోవడం వల్ల క్రికెట్ చరిత్రకారులకు మాత్రమే అసాధారణ ఇన్నింగ్స్ గురించి పూర్తిగా తెలుసు.
6000 పరుగులు, 600 వికెట్లు - క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లు వీళ్లే!
క్రికెట్ వదిలేసి కెనడాకు! - కట్ చేస్తే ముంబయి రూ.5.25 కోట్లకు కొనేసింది!