Vijayalakshmi Temple Hospet Karnataka : కర్ణాటకలో అతి ప్రాచీనమైన, పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట సమీపంలో ఉన్న 'పంపా' సరోవరం సుందరమైన ప్రదేశం. ఈ సరోవరం గట్టుపై వెలసిన విజయలక్ష్మి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా, ప్రాచీనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
ఆలయ స్థల పురాణం
విజయనగర సామ్రాజ్యం స్థాపకుడుగా పేరు గాంచిన విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు దాదాపు 12 ఏళ్ల పాటు పంపా సరోవర తీరంలో తపస్సు చేశాడంట! ఆ సమయంలో ఆయన రోజూ కనకధారాస్తవం చేసేవాడట. విద్యారణ్య స్వామి చేసిన కనకధారా స్తవానికి అమ్మవారు అనుగ్రహించి కనక వర్షం కురిపించిందట. అమ్మవారు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలోనే విద్యారణ్య స్వామి అమ్మవారికి ఆలయం నిర్మించాడని స్థలపురాణం.
సుందరమైన ఆలయం
అమ్మవారు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలో నిర్మించిన ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిగా పూజలందుకుంటుంది. పచ్చని ప్రకృతి రమణీయతల మధ్య నిర్మించిన ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ఎంతో సుందరమైనది. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకోడానికి రెండు కళ్లూ సరిపోవంటారు.
సకల విజయాలు - అష్టైశ్వర్యాలు
విజయలక్ష్మి అమ్మవారిని అమ్మవారిని దర్శించుకోవడం వలన, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అసలు పూర్తి కావు అనుకున్న పనుల్లో కూడా తిరుగులేని విజయాలు చేకూరతాయని భక్తుల నమ్మకం. పంపా సరోవరం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయలక్ష్మి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.
విశేష పూజలు
విజయలక్ష్మి ఆలయంలో నిత్యం అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామ పూజలు జరుగుతాయి. శుక్రవారాల్లో అభిషేకాలు, కుంకుమ పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో, దేవి నవరాత్రుల సమయంలో ఈ దేవాలయంలో విశేష పూజలు, ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అంతే కాకుండా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు అమ్మవారిని దర్శించుకుంటే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారు.
ఎలా చేరుకోవచ్చు?
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేటకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. విజయాలనందించే విజయలక్ష్మిని మనం కూడా దర్శించుకుందాం.తరిద్దాం. ఓం విజయలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.