Best Time to Visit Temples in Telugu : మనలో చాలా మంది నిత్యం దేవాలయాలకు వెళ్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేరాలని, మనశ్శాంతి కోసం, ఆరోగ్యం బాగుండాలని, కష్టాలు తీరాలని, అదృష్టం కలిసి రావాలని ఇలా రకరకాల కారణాలతో ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. అలాగే కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించాలనే కోరికతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వెళ్తుంటారు. అయితే అసలు దేవాలయాలకు ఏ సమయంలో వెళ్లాలి? ఏ సమస్యలు ఉన్నవారు ఏ గుళ్లకు వెళ్లాలి? అనే వివరాలను ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేవాలయాలను ఏ సమయంలో దర్శించాలి: చాలా మంది ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయాలకు వెళ్తుంటారు. అలాగే పండగ రోజుల్లో అయితే సమయంతో పని లేకుండా గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే దేవాలయాలకు వెళ్లడానికి కూడా ఓ సమయం ఉంటుందని మాచిరాజు చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు మూర్తి ఆలయం లేదా విష్ణు సంబంధమైన ఆలయాలను ప్రాతఃకాలం(ఉదయం)లో దర్శించుకోవాలని చెబుతున్నారు. శివాలయాన్ని ప్రదోష కాలంలో దర్శించుకుంటే మంచిదంటున్నారు. ఆంజనేయ స్వామి ఆలయానికి శనిహోర ఉన్న సమయంలో వెళ్లాలని అంటున్నారు. శని హోర అంటే శని గ్రహం అధిపతిగా ఉండే సమయం. ఈ సమయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
దేవాలయ దర్శనం చేసుకుంటే కలిగే ఫలితాలు:
- అమావాస్య రోజు ఇలవేల్పును దర్శించుకుంటే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటున్నారు.
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడే వారు, కారణం తెలియని జబ్బుతో అవస్థలు పడే వారు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు మీ ఇంటి దైవాన్ని దర్శించుకుంటే సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. మీరు పుట్టిన రోజు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రం ఉన్న రోజున మీ కుల దైవం దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
- దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే బుధవారం రోజు లక్ష్మీ నారాయణులు ఆలయానికి వెళ్లి జామపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వాటిని అక్కడి భక్తులకు నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యంగా ఉంటారని చెబుతున్నారు.
- జన్మజన్మల నుంచి వెంటాడుతున్న దరిద్రం పోవాలంటే సముద్ర తీరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలని మాచిరాజు చెబుతున్నారు. నదీ తీరంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని వివరిస్తున్నారు.
- మోక్షం కలగాలంటే కొండ మీద కొలువైన దేవుళ్లను దర్శించాలని చెబుతున్నారు.
- వనాల్లో ఉన్న ఆలయాలు దర్శిస్తే తీవ్రమైన కష్టాలు తొలగిపోతాయని సూచిస్తున్నారు.
- జన్మజన్మల దరిద్రాలు, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేస్తే మంచిదని అంటున్నారు.
- కష్టనష్టాలు ఉంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో సుప్రభాత సేవలో పాల్గొంటే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు.
- ఇల్లు నిర్మించేటప్పుడు ఏమైన ఆటంకాలు ఎదురైతే తొమ్మిది శుక్రవారాలు మీ ఇంటి దైవం ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే ఇంటి నిర్మాణం తొందరగా పూర్తవుతుందని అంటున్నారు.
- గురుబలం పెరగడానికి గురువారం రోజు దత్తాత్రేయ దర్శనం చేసుకుని పటిక బెల్లం, పండ్లు నైవేద్యంగా పెట్టి అక్కడి భక్తులకు పంచి పెట్టాలని చెబుతున్నారు.
- కుటంబ సభ్యుల మధ్య నిత్యం కలహాలు, సఖ్యత లేనప్పుడు జీవనదీ తీరంలో ఉన్న దేవాలయానికి వెళ్లి కుటుంబ సభ్యులంతా దర్శనం చేసుకుని ఆ రాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుందని అంటున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
ఎన్ని పరిహారాలు చేసినా మిమ్మల్ని దరిద్రాలు వెంటాడుతున్నాయా? - కలబందతో ఇలా చేస్తే తొలగిపోతాయట!