TDP Leaders Celebrating after getting Ticket in Third List: తెలుగుదేశం మూడో జాబితాలో చోటు దక్కించుకున్న నేతల నివాసాలు, కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నేతలకు టికెట్ ప్రకటించడంతో అభిమానులు, అనుచరులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. తమ నాయకుడు గెలిపించుకుని తీరుతామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. మైలవరం తెలుగుదేశం అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పేరు ఖరారు చేయడంతో ఆయన స్వగ్రామం ఐతవరంలో సంబరాలు అంబరాన్నంటాయి. వసంత అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సందడి చేశారు. మైలవరం బస్టాండ్ వద్ద కూడా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేశారు.
దేవినేని కుటుంబానికి దక్కని టీడీపీ టికెట్ - 41 ఏళ్లలో తొలిసారి - No TDP Ticket to Devineni Family
పెనమలూరు తెలుగుదేశం టికెట్ బోడె ప్రసాద్‌కు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. పోరంకిలోని బోడె ప్రసాద్ కార్యాలయానికి శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట తెలుగుదేశం అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు పేరును ప్రకటించడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి సందడి చేశారు.
చీరాల అభ్యర్థిగా ఎం.ఎం. కొండయ్య యాదవ్‌కు ఖరారు చేయడంతో ఆయన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు, అభిమానులు కొండయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు తినిపించుకున్నారు. జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ సీటు వనమూడి కొండబాబుకు కేటాయించడంతో ఆయన నివాసం వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనకే టికెట్ ఇవ్వడంపై కొండబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలలో కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని అన్నారు.
అమలాపురం అభ్యర్థిగా చంద్రబాబు తన పేరు ప్రకటించడంపై హరీష్ మాధుర్ సంతోషం వ్యక్తం చేశారు. పుట్టినరోజు నాడు చంద్రబాబు, లోకేశ్ తనకు అతి పెద్ద బహుమతి అందించారన్నారు. తన తండ్రి మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పేరు ప్రకటించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి టికెట్ కేటాయించినందుకు చంద్రబాబుకు నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారధి పేరు ఖరారు చేయడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. పార్థసారధి ఇంటి వద్ద టపాసులు పేల్చి సందడి చేశారు.