Police Interrogated Vallabhaneni Vamsi for 5 Hours: 'ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను. అక్కడ మాజీ సీఎం జగన్‌ని కలిసి తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లాను' అని వల్లభనేని వంశీ పోలీసు కస్టడీలో ఒప్పుకున్నారు. తాడేపల్లి వెళ్లాను కానీ ఎవరినీ కలవలేదని తొలిరోజు విచారణలో చెప్పిన వంశీ ఫోన్ కాల్ డేటా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారాలు చూపేసరికి నిజం ఒప్పుకున్నారు.
12వ తేదీ నాటి ఆయన కాల్ డేటాను, ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే ఫోన్ లోకేషన్ చూపిస్తోందని గట్టిగా ప్రశ్నించేసరికి జగన్‌ని కలిసినట్లు ఆయన అంగీకరించారు. అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్లు తెలిసింది. రెండోరోజు పోలీసు కస్టడీలో వంశీని 5 గంటల పాటు ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను కస్టడీలోకి తీసుకుని ముగ్గురు ఏసీపీలు వేర్వేరుగా విచారించారు. వంశీకి దాదాపు 25 ప్రశ్నలు పోలీసులు సంధించినట్లు తెలిసింది. ఎక్కువ ప్రశ్నలకు తనకేం తెలీదని సమాధానం చెప్పినట్లు సమాచారం.
పోలీసుల ప్రశ్నలకు వంశీ జవాబులు:
- పోలీసులు: మీ మొబైళ్లు ఎక్కడ ఉన్నాయి?
- వల్లభనేని వంశీ: నేను 3 సిమ్‌లను 2 ఫోన్లలో వేసి ఉపయోగిస్తున్నా కాకపోతే అవి ఎక్కడ పెట్టానో గుర్తు లేదు.
- పోలీసులు: సత్యవర్ధన్‌ను అపహరించి హైదరాబాద్, విశాఖకు ఎందుకు తరలించారు? తరలించిన వారితో మీకేం సంబంధం?
- వంశీ: ఎందుకు వచ్చారో, ఎక్కడకు తీసుకెళ్లారో నాకు తెలియదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వారిలో వేల్పుల వంశీ, వేణు, చేబ్రోలు శ్రీను ఎవరో నాకు తెలియదు. మిగిలిన వారు మాత్రం నా అనుచరులే వారితో నాకు పరిచయం ఉంది.
- పోలీసులు: పరారీలో ఉన్న నిందితులను మీరే దాచారా?
- వంశీ: వాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు
వంశీ ఆదేశాల మేరకే చేశాము: వంశీ ఆదేశాల మేరకే తాము సత్యవర్ధన్‌ను అపహరించి బెదిరించి హైదరాబాద్, విశాఖపట్నం తీసుకెళ్లామని నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి అంగీకరించినట్లు సమాచారం. కిడ్నాప్‌నకు వంశీయే ప్రణాళిక వేశారని తమకు యతీంద్ర రామకృష్ణ, యర్రంశెట్టి రామాంజనేయులు చెప్పారన్నారు. ఈ నెల 10న రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ సత్యవర్ధన్‌ను కోర్టు నుంచి నలుపు రంగు క్రెటా కారులో హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వంశీ ఆదేశాలతో తిరిగి విశాఖకు అదే కారులో తీసుకెళ్లి తొలుత హోటల్‌లో, తర్వాత ఓ ఫ్లాట్‌లో ఉంచామని వెల్లడించారు.
పోసాని కృష్ణ మురళి అరెస్ట్ - రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం
' నాకేం తెలియదు - సంబంధం లేదు' - పోలీసుల విచారణలో వంశీ సమాధానాలు