BRS Leader Harishrao on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీవీల ముందు ఉపన్యాసాలు మాని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను తక్షణమే కాపాడాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. సీఎం దిల్లీ పర్యటనలోనూ, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం సబబు కాదని హరీశ్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది జాడ కనుక్కోవడంలో, సహాయక చర్యలు ముమ్మరం చేయకపోవడంపై ప్రభుత్వ వైఫల్యం కనబడుతోందని హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను గత ప్రభుత్వం 13 కిలోమీటర్ల మేర చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదని ఆయన విమర్శలు చేశారు. ఈ నెల 22న దుర్ఘటన జరిగినా, పార్టీ రాజకీయాలు చేయరాదని భావించి సంయమనం పాటించినట్లు హరీశ్ రావు తెలిపారు.
సలహాలు, సూచనలు ఇస్తాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీని విమర్శించడంతోనే దీనిపై స్పందించాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. ప్రెస్‌మీట్ అనంతరం మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పార్టీ నాయకులతో కలిసి ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతం వద్దకు ఆయన బయలుదేరి వెళ్లారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల సహాయక చర్యలపై ఆరా తీసి, సలహాలు, సూచనలు ఇస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను వేగవంతం చేసి టన్నెల్‌లో చిక్కుకున్న వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చేందుకు చొరవ చూపించాలని కోరారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం : ఈ నెల 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది సొరంగంలో చిక్కుకున్నారు. సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు ఐదు రోజులుగా ఆపరేషన్ టన్నెల్‌ను నిర్వహించారు. టన్నెల్‌లో బురద, నీటితో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా, సింగరేణి కాలరీస్, ర్యాట్ మైనర్లు ఇలా చాలా మంది రెస్క్యూ బృందాలు పాల్గొన్నాయి. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారు.
SLBC టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి - నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట
ఇక లాభం లేదు - కాస్త రిస్కైనా పర్వాలేదు - రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి!