Ways to Use Purifier Waste Water: నేటిరోజుల్లో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వాటర్ ప్యూరిఫయర్ ఉంటోంది. ఇది తాగు నీటిని శుద్ధి చేసే పరికరం. అయితే ఈ ప్యూరిఫయర్‌తో మనకు మంచి నీళ్లు అందడం వరకు బానే ఉన్నా, ఆ ప్రక్రియతో ఎన్నో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆ నీటిని వేస్ట్ చేయకుండా ఇతర పనులకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఒక లీటరు మంచి నీటిని శుద్ధి చేయడానికి దాదాపు మూడు లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఆ లెక్కన రోజుకు ఒక్కో ఇంట్లో ఎన్ని లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగానే వాటర్ స్టోరేజ్ బాక్సులొచ్చాయి. వీటిని షాప్స్ లేదా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో వివిధ పరిమాణాలు, పలు రకాల వేస్ట్ వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా మీరు వాటిని కొనుగోలు చేయవచ్చు. కొన్ని వాటర్ ప్యూరిఫయర్ బ్రాండ్‌లు వేస్ట్ వాటర్ ట్యాంక్‌లను విడిగా విక్రయిస్తాయి.
వేస్ట్ వాటర్‌ను ఎలా ఉపయోగించవచ్చు? : వాటర్ ప్యూరిఫయర్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలను (వేస్ట్ వాటర్) వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా RO (రివర్స్ ఓస్మోసిస్) వాటర్ ప్యూరిఫైయర్ల నుంచి వచ్చే నీటిలో TDS (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) ఎక్కువగా ఉండటం వల్ల తాగడానికి పనికిరాదు. కానీ, ఇతర పనులకు ఉపయోగించవచ్చు. అందులో కొన్నింటిని చూస్తే,
- చాలా మంది బాత్రూమ్ కడిగే సమయంలో ఎక్కువ మంచి నీటిని వృథా చేస్తుంటారు. అలాంటి వారు వాటర్ ప్యూరిఫయర్‌లోని వేస్ట్ వాటర్‌ను ఉపయోగించి టాయిలెట్స్ కడగడం, ఫ్లష్ చేయడం వంటివి చేయవచ్చని చెబుతున్నారు.
- సింక్‌లోని గిన్నెలు కడగడానికి ట్యాప్ వాటర్‌ను చాలా ఎక్కువ మొత్తంలో వేస్ట్ చేస్తుంటారు. అయితే ఈ సారి గిన్నెలు కడిగేందుకు ట్యాప్ వాటర్ కాకుండా ఈ వాటర్‌ను ఉపయోగిస్తే మంచిదంటున్నారు.
- ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఈ కాలంలో మొక్కలకు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. అలాంటి సమయంలో ఈ స్టోరేజ్ బాక్స్‌లో ఉన్న నీటిని మొక్కలకు పోయడానికి ఉపయోగించుకోవచ్చు.
- RO నుంచి విడుదలయ్యే నీటిని ఇళ్లు తుడుచుకోవడం, గ్యాస్ స్టౌ, కిచెన్ సింక్, బండ కడగడం వంటి వంటి వివిధ పనుల కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ఈ నీరుతో స్నానం చేయవచ్చా: ఈ క్రమంలోనే చాలా మందికి ఫిల్టర్ నుంచి వృథాగా పోతున్న నీటితో స్నానం చేయవచ్చా అనే డౌట్ వస్తుంది. అయితే ఇలా వచ్చే వేస్ట్ వాటర్‌తో స్నానం చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో TDS ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ నీరు చర్మంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులకు కారణం కావచ్చని అంటున్నారు. అలాగే ఈ నీటిని వంట చేయడానికి కూడా ఉపయోగించకూడదని చెబుతున్నారు.
వాడిన టీ బ్యాగ్స్ పడేస్తున్నారా? - ఇలా ఉపయోగిస్తే ఎన్నో బెనిఫిట్స్! - అస్సలు నమ్మలేరు!
ఈ తాళాలు ఉంటే మీ అన్ని డాక్యుమెంట్స్ సేఫ్ - ఎలా వినియోగించాలంటే?