PALAM PACHADI : ఇవాళ పచ్చడి అంటే మిక్సీలో గ్రైండ్ చేసిందే. అది కూడా తాలింపు పేరుతో నూనెలో వేయించేదే. కానీ, చుక్క ఆయిల్ లేకుండా రోట్లో నూరి పదే పది నిమిషాల్లో సిద్ధం చేసే పచ్చడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే.. పాత కాలం నాటి "పొలం పచ్చడి". ఈ రోటి పచ్చడిని పూర్వీకులు ఆయిల్ అన్నదే వాడకుండా, ఇంకా చెప్పాలంటే పొయ్యి కూడా వెలిగించకుండా తయారు చేసుకునేవారు.
పొలానికి వెళ్లేవారు ఈ పచ్చడినే ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే వాళ్లు. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో, తక్కువ సమయంలోనే రుచికరమైన చట్నీ తయారుచేసుకోవచ్చు. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
పచ్చి మిర్చి - 10 - 12
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - టీస్పూన్
చింతపండు - పెద్ద నిమ్మకాయంత సైజు
వెల్లుల్లి రెబ్బలు - పది
కొత్తిమీర తరుగు - తగినంత
ఉప్పు - సరిపడా
తయారీ విధానం :
- పచ్చి మిర్చిని మనం రోజూ వాడే సన్నవి కాకుండా కాస్త లావుగా ఉన్నవి ఎంచుకోండి. సన్నగా ఉండే కారం ఎక్కువగా ఉంటాయి. లావుగా ఉండేవి కాస్త తక్కువ కారంగా ఉంటాయి. వీటిని సన్నగా కట్ చేసుకోండి.
- మీరు కాస్త కారం ఎక్కువ తినేవారైతే గనక రెండు, మూడు కారం మిర్చి యాడ్ చేసుకున్నా పర్వాలేదు.
- చింతపండు నిమ్మకాయ సైజులో తీసుకొని, ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి.
- వెల్లుల్లి రెబ్బలను చక్కగా పొట్టుతీసి పక్కన పెట్టుకోండి.
- మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని, దాన్ని కాస్త పెద్దగానే ఐదారు ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఆ తర్వాత రోటిలో టీస్పూన్ జీలకర్ర వేయండి. దాన్ని మెత్తగా దంచుకోండి.
- అనంతరం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసి, మెత్తగా నూరుకోండి.
- తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇవి కలిసేలా మరోసారి నూరుకోండి.
- ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీ ముక్కలను కొన్ని కొన్నిగా వేసుకుంటూ కాస్త బరకగా నూరుకోవాలి.
- తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి, కచ్చాపచ్చాగా ఉండేలా రుబ్బు కోవాలి.
- పచ్చడి బరకగా ఉంటేనే, అందులోని ఇంగ్రీడియంట్స్ తినేటప్పుడు దంతాలకు తగులుతూ టేస్టీగా ఉంటాయి.
- ఇలా పచ్చడి నూరుకున్న తర్వాత, చివర్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- అంతే, చాలా రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్ పాతకాలం నాటి పొలం పచ్చడి సిద్ధమైపోతుంది.
- ఈ పట్టడిని వేడివేడి అన్నంలో తిన్నారంటే, కచ్చితంగా వారెవ్వా అంటారు.
- అయితే.. ఈ పచ్చడి రోట్లో నూరుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి :