Wedding Special Nimmakaya Pulihora : పులిహోర ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. అయితే మన దగ్గర చింత పండు పులిహోర అందరికీ తెలుసు. ఈసారి తమిళనాడు వెడ్డింగ్ స్టైల్ "నిమ్మకాయ పులిహోర"ను ట్రై చేయండి. సరికొత్త తీరులో, అద్దిరిపోయే రుచితో నోరూరిస్తుంది. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ పులిహోరకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నిమ్మకాయలు - 3 (పెద్ద సైజ్‌వి)
- అన్నం - ఒకటిన్నర కప్పులు
- పంచదార - అరటీస్పూన్
- సన్నని అల్లం తరుగు - 1 టేబుల్‌స్పూన్
- నూనె - 5 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- శనగపప్పు - 2 టీస్పూన్లు
- మినపప్పు - 2 టీస్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 15 నుంచి 20
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 5
- చల్ల మిరపకాయలు - 4
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - 2 రెమ్మలు
- పచ్చి బఠాణీలు - పావు కప్పు
- పసుపు - ముప్పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- సన్నని పచ్చిమిర్చి తరుగు - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
"పిండి పులిహోర" ఎప్పుడైనా తిన్నారా? - ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
తయారీ విధానం :
- స్టౌపై వెడల్పాటి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి పొంగనివ్వాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి.
- అలా వేయించాక అందులో జీలకర్ర, జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించాలి. ఆపై చల్లమిరపకాయలనూ వేసి తాలింపుని చక్కగా వేయించుకోవాలి.
- పులిహోర రుచి, పరిమళం మొత్తం తాలింపులోనే దాగి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- తాలింపు చక్కగా వేగి, మంచి సువాసన వస్తున్నప్పుడు అందులో ఇంగువ, కరివేపాకు, ఫ్రోజెన్ పచ్చిబఠాణీలు వేసుకొని బఠాణీలపై వైట్ లేయర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక పసుపు, సన్నని అల్లం తరుగు వేసి బాగా టాస్ చేసి మరికాసేపు తాలింపుని ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు మంచిగా వేగాక అందులో 50ఎంఎల్ వాటర్ వేసుకొని కలిపి హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి.
- ఇదే, నిమ్మకాయ పులిహోరకు పర్ఫెక్ట్ టేస్ట్‌ని తీసుకొచ్చే సీక్రెట్ టిప్. నార్మల్‌గా చల్లారిన నిమ్మకాయ పులిహోర బిరుసెక్కిపోతుంది. అదే, హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం ద్వారా ఆ ఇబ్బంది అస్సలు ఉండదని గుర్తుంచుకోవాలి.
- వాటర్ మరుగుతున్నప్పుడు నిమ్మకాయలను కట్ చేసి రసాన్ని పిండుకోవాలి. ఆపై ఉప్పు వేసి కలిపి ఎసరుని బాగా మరిగించాలి.
- ఎసరు బాగా మరిగి వాటర్ సగానికి పైగా ఇగిరిపోయిన తర్వాత అందులో ఉప్పు వేసి వండుకున్న అన్నం వేసుకొని గరిటెతో మిశ్రమం మొత్తం కలిసేలా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి.
- ఇక చివర్లో సన్నని పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దింపేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి పంచదార వేసుకొని మరోసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే తమిళనాడు వెడ్డింగ్ స్టైల్ "నిమ్మకాయ పులిహోర" రెడీ!
సూపర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!