Dhanushkoti Village : మన దేశంలోని చిట్ట చివరి గ్రామంగా ధనుష్కోటిని పిలుస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఒకప్పుడు ధనుష్కోటి ఎంతో సుందర ప్రాంతం. భారత్ -శ్రీలంక మధ్య వాణిజ్యపరంగా ఎంతో కీలకంగా ఉండేది. కానీ, 1964 డిసెంబర్ 23వ తారీఖు కాళరాత్రిగా మిగిలిపోయింది. ఎప్పటికీ కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీలంకకు చాలా దగ్గరగా :
తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరానికి దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో పంబన్ దీవుల్లో ఈ ధనుష్కోటి గ్రామం ఉంది. శ్రీలంకను కలిపే "రామసేతు" ఈ గ్రామంలోనే ఉంది. పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని రెండు సముద్రతీరాలు ఉన్న ధనుష్కోటి, శ్రీలంకకు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది. కేవలం 18 మైళ్ల దూరం మాత్రమే ఉంటుంది. దీంతో ఇక్కడ్నుంచి లంకకు నౌకాయానం ప్రారంభిస్తే మంచి ఆదాయం లభిస్తుందని ఆంగ్లేయులు భావించారు. ఆ విధంగా ధనుష్కోటిలో హార్బర్ ఏర్పాటు చేశారు. 1914లో తలైమన్నార్, ధనుష్కోటి మధ్య రెండు పడవలతో రవాణా మొదలైంది. ఈ రవాణా ద్వారా వచ్చే సరుకును తరలించడానికి చెన్నై నుంచి ధనుష్కోటికి కూడా రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఆ విధంగా భారీస్థాయిలో వర్తకం జరిగే హార్బర్‌గా ధనుష్కోటి మారిపోయింది.
మినీ సింగపూర్ :
వాణిజ్యం అంతకంతకూ పెరగడంతో ధనుష్కోటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. శ్రీలంక వైపు ప్రయాణించే వారు నగదు మార్చుకునేందుకు ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇంకా పోలీస్‌స్టేషన్, తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అలా ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన ధనుష్కోటిని "మినీ సింగపూర్"గా పిలిచేవారు. అలా విరాజిల్లుతున్న ధనుష్కోటికి 1964 డిసెంబరు 23 కాళరాత్రిగా పరిణమించింది.
ఆ చీకటి రాత్రి :
ఆ రోజు సాయంత్రం గాలులతో ఒక మోస్తరు వర్షం మొదలైంది. సమయం గడుస్తున్నకొద్దీ గాలి వేగం పెరిగింది. సముద్రంలో కల్లోలం పెరుగుతూ పోయింది. చీకటి అవుతున్న కొద్దీ వర్షం తీవ్రస్థాయికి చేరింది. ఈదురు గాలులు, భారీ వర్షంతో ప్రజలు, అధికారులు బిక్కు బిక్కుమంటూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. మరి కాసేపట్లో తెల్లవారుతుందనగా రాకాసి అలలు ధనుష్కోటిని చుట్టు ముట్టాయి. కనికరం లేకుండా నివాసాలపై దాడి చేశాయి. నివాసాలు, కార్యాలయాలు అన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ధనుష్కోటి ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయింది.
రైలు, ప్రయాణికులు కూడా :
పాంబన్ నుంచి ధనుష్కోటికి బయలుదేరిన రైలు కూడా సముద్ర అలల్లో చిక్కుకుపోయింది. అందులో ఉన్న దాదాపు వంద మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. ఆ తుఫాను ధాటికి పాంబన్ వంతెన కూడా ముక్కలైపోయింది. ఈ దారుణ సంఘటన మరుసటి ఉదయానికి గానీ బయటి ప్రపంచానికి తెలియలేదు. ధునుష్కోటి మొత్తం నీట మునిగి చిన్న దీవిలాంటి ప్రాంతమే మిగిలింది. ఎక్కడ చూసినా చెల్లాచెదురైన మృతదేహాలు కనిపించాయి. ఈ మహా విలయంలో దాదాపు 800 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. నివాసయోగ్యంగా లేకపోవడంతో ప్రాణాలతో మిగిలిన ఉన్నవారిలో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ ప్రాంతమే తమ నివాసంగా భావించి, అక్కడే ఉండిపోయారు.
వెళ్లి వస్తున్న పర్యాటకులు :
నాటి విలయానికి గుర్తుగా శిథిలంగా మిగిలిన అక్కడి చర్చి, పోర్టు, రైల్వే స్టేషన్ ప్రాంతాలు ఇప్పుడు పర్యాటక ప్రాంతాలుగా మారాయి. రామేశ్వరం వెళ్లే పర్యాటకులు ధనుష్కోటిని కూడా చూసి వస్తుంటారు. ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించి రావచ్చు. నాటి విషాదంతో "ఘోస్ట్ సిటీ"గా పిలుచుకునే ఆ ప్రాంతంలో, రాత్రివేళ ఉండటానికి మాత్రం దాదాపుగా అనుమతించరు. రామేశ్వరానికి రైలు, బస్సులో చేరుకోవచ్చు. మీరు గనక రామేశ్వరం వెళ్తే, తప్పకుండా దేశపు చిట్టచివరి గ్రామాన్ని సందర్శించి రండి.
ఇవి కూడా చదవండి :
ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - అయితే ఈసారి తెలంగాణ 'అరకు' వెళ్లి రండి!
కేవలం రూ.380కే హైదరాబాద్ సిటీ టూర్ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!