Child Parenting Tips in Telugu: ఈ మధ్య కాలంలో పిల్లలు అడిగిందల్లా ఇవ్వడమే గొప్ప అనుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ, ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం శ్రమించకుండానే కోరినవన్నీ దక్కుతుంటే భవిష్యత్తులో కష్టనష్టాలను తట్టుకోలేకపోవచ్చని అంటున్నారు. ఒక్కోసారి ఎప్పుడైనా తాము అనుకున్నది జరగనప్పుడు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం, వాటిని సాధించుకోవడానికి ఇతరుల్ని బెదిరించడం వంటివి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనో ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా కొందరు తల్లిదండ్రులు.. తాము పడ్డ కష్టాలు తమ బిడ్డలు పడకూడదని అనుకుంటారు. అందుకే పిల్లలు అడగకముందే అన్నీ ఇచ్చేస్తుంటారు. ఇదీ మంచి విషయమే అయినా, అవసరాలకు మించిన సౌకర్యాలు, విలాసాలకు వారు అలవాటు పడితే భవిష్యత్తుకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కష్టం విలువ తెలియకపోతే, సర్దుబాట్లు అర్థం కాకపోతే ఒక్కోసారి జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ఏ వయసులో ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? అన్నది పెద్దలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక్కోసారి పిల్లలు తాము కోరింది చేయాల్సిందేనని పట్టుబడుతుంటారు. ఒకసారి మీరు అంగీకరించడం మొదలుపెడితే దాన్నే అలుసుగా తీసుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నో చెప్పాల్సిందే అనుకున్నప్పుడు మొహమాటానికి పోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఖరీదైన వస్తువులనో, వినోదాలనో ఎంచుకుంటే మీ స్థాయికి తగ్గ ప్రత్యామ్నాయాలను చూపించాలని సలహా ఇస్తున్నారు. తక్కువలోనూ ఎక్కువ సంతృప్తి పొందగలిగే విధానాలను పరిచయం చేయాలని.. అప్పుడే పిల్లలకు జీవితం విలువ అర్థమవుతుందని వివరిస్తున్నారు.

ఏ కారణంతో అయినా పిల్లలు అడిగింది ఇవ్వాలని పేచీ పెడితే వెంటనే తలొగ్గకూడదని నిపుణులు అంటున్నారు. వారు అడిగింది ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే ఊరికే ఇచ్చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు అంగీకరించాల్సి వచ్చినా.. దానికి షరతులు విధించాలని సలహా ఇస్తున్నారు. దాన్ని సాధించాలంటే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలని సలహా ఇస్తున్నారు. వాటిని పూర్తి చేస్తేనే అడిగినవి దక్కుతాయని వారికి వివరించాలని చెబుతున్నారు. అప్పుడే ఏదైనా కావాలంటే కష్టపడాలన్న విషయం పిల్లలకు అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంటి పనులు మీరే చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
రిజైన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఇలా చేస్తే మంచిది కాదని నిపుణుల సూచన