Char Dham Yatra 2025 : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసింది. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన చార్ధామ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కానుంది. ఎత్తైన కొండలు, పర్వతాలు, నదులను దాటుతూ సాగే యాత్రను పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? ఇందులో ఏ ఏ క్షేత్రాలు ఉంటాయి? యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది? సమీపంలోని దర్శనీయ ప్రదేశాలు ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చార్ధామ్ యాత్ర అంటే ఏంటి?
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తుంటారు. ఈ యాత్రలో భాగంగా ఈ నాలుగు పుణ్య క్షేత్రాలను భక్తులు దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని ఆధ్యాత్మిక లోకంలో మునిగిపోతుంటారు.

యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది?
చార్ధామ్ యాత్ర తేదీలను ప్రతి ఏటా మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రకటిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని మే 2 ఉదయం 7గంటలకు తెరవనున్నట్లు బుధవారం ప్రకటించారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తపిల్యాల్ వెల్లడించారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుచుకోనున్నట్లు వివరించారు.

యమునోత్రి ధామ్ : చార్ధామ్ యాత్రలో సందర్శించే తొలి పుణ్య క్షేత్రం యమునోత్రి. ఇది యుమునా నదికి 3,293 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు : రైతాల్, బార్సు, ఉత్తరకాశీ, హనుమాన్ ఛట్టీ, జానకీ చట్టీ, ఖర్సాలీ, బర్కోట్, డయారా బుగ్యాల్,
గంగోత్రి ధామ్ : చార్ధామ్ యాత్రలో రెండో పుణ్య క్షేత్రం గంగోత్రి ధామ్. ఇది గంగా నదికి 3,100 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు : భగీరథీ కొండ, దోడి తల్, కేధార్ తల్, గంగోత్రి ఆలయం, గంగోత్రి నేషనల్ పార్క్, గోముఖ్ తపోవన్ ట్రెక్, కేధార్ తల్ ట్రెక్
కేదార్నాథ్ ధామ్ : దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం 3,583 అడుగుల ఎత్తులో ఉంటుంది
దర్శనీయ ప్రదేశాలు : గాంధీ సరోవర్, సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ ఆలయం, వాసుకీ తల్, శంకరాచార్య సమాధి, భైరవనాథ్ ఆలయం, రుద్ర కేవ్
బద్రీనాథ్ ధామ్: చార్ధామ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ ఆలయం అలకనంద నదికి 3,133 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి బద్రీ చెట్టు కిందనే విష్ణువు ధ్యానం చేసినట్లు భక్తులు భావిస్తుంటారు.
దర్శనీయ ప్రదేశాలు : వసుధార జలపాతం, నరాడ్ కుండ్, సతోపంత్ ట్రెక్, హెమకుండ్ సాహిబ్, ఫ్లవర్స్ వ్యాలీ
ఎప్పుడు వెళితే మంచిది?
చార్ధామ్ యాత్ర చేసేందుకు మే-జూన్ లేదా సెప్టెంబర్- అక్టోబర్ మంచి సమయంగా భక్తులు భావిస్తుంటారు. ఈ సమయంలో వాతావరణం పర్యటకులకు అనుకూలంగా ఉంటుంది. అయితే, జులై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫలితంగా కొండచరియలు విరిగపడడం, వరదలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. నవంబర్ నుంచి ఏప్రిల్ సమయంలో భారీ హిమపాతం కారణంగా కొన్ని నెలల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
చార్ధామ్ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, ఫొటోలు, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : ఇందుకోసం ఉత్తరాఖండ్ టూరిజం లేదా చార్ధామ్ యాత్ర పోర్టల్‌ను సందర్శించాలి. అందులోకి వెళ్లి వ్యక్తిగత వివరాలు, పత్రాలు సమర్పించి నమోదు చేసుకోవాలి.
ఆన్ సైట్ రిజిస్ట్రేషన్స్ : ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారికోసం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్లు కూడా స్వీకరిస్తుంటారు. ఇందుకోసం హరిద్వార్, రిషికేశ్‌తో పాటు నాలుగు యాత్ర ప్రారంభ ప్రదేశాల్లో రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.

శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? ఇలా చేస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసా?
శివరాత్రికి చిలగడదుంప తింటారా? రొటీన్‌గా ఉడకబెట్టకుండా వెరైటీగా హల్వా చేసుకోండిలా!