US Trump Zelenskyy Critical Minerals Deal : విస్తృత ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా అమెరికా, ఉక్రెయిన్ సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక అగ్రిమెంట్‌పై శుక్రవారమే సంతకాలు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇంతకుముందే ప్రతిపాదించారు.
జెలెన్‌స్కీ ప్లాన్ అదేనా?
ఖనిజాలతోపాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. తొలుత దీనికి అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ భావిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం ట్రంప్‌తో భేటీ కానున్నారు. జెలెన్‌స్కీ తనను కలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, నచ్చితే ఒప్పందంపైనా ఆయన సంతకం చేయవచ్చని ట్రంప్ విలేకరులతో అన్నారు. అగ్రిమెంట్ విలువ లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని ఆయన అంచనా వేశారు.
'డబ్బులు వాపస్ తెస్తాం!'
శ్వేతసౌధంలో శుక్రవారం జెలెన్స్స్కీతో భేటీ కాబోతున్నట్లు చెప్పిన ట్రంప్, ఈ డీల్‌పై ఆయన సంతకం చేయనున్నట్లు తెలిపారు. దీన్ని చాలా పెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా దాదాపు మూడేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా పన్నుదారుల డబ్బును చాలా వెచ్చించిందన్నారు. తాజా ఒప్పందం ద్వారా ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖానిజాల వెలికితీతకు తమకు యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు. తద్వారా అమెరికా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడానికి ఉక్రెయిన్‌కు అవకాశం లభిస్తుందన్నారు. "గత(బైడెన్) ప్రభుత్వం అమెరికన్లను చాలా క్లిష్టపరిస్థితుల్లో పెట్టింది. కామీ మేము ఆ దేశానికి అందించిన నిధులను తిరిగి రాబట్టేలా ఒక ఒప్పందం చేయగలిగాము. భవిష్యత్తులో చాలా డబ్బులు పొందుతాము" అని ట్రంప్ చెప్పారు.
'ఒప్పందంలో అదే కీలకం - వాటిని చేర్చలేదు'
ఇదే విషయంపై బుధవారం జెలెన్‌స్కీ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందం యొక్క ఫ్రేమ్‌వర్క్ కుదిరిందని తెలిపారు. అయితే ఉక్రెయిన్‌కు కీలకమైన అమెరికా భద్రతా హామీలు అందులో చేర్చలేదని వెల్లడించారు. పూర్తి ఒప్పందం వాషింగ్టన్లో జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ఒక ప్రాథమిక అడుగు అని, సమగ్ర ప్యాకేజీ ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు.