Israel Hamas Ceasefire Deal : ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో తొలి విడత గడువు దాదాపు ముగియడం వల్ల రెండో దఫా చర్చలపై హమాస్ దృష్టిపెట్టింది. రెండో విడత చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించింది. అయితే, మిగిలిన బందీలను హమాస్ అప్పగించేలా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసేందుకు రెండో విడత చర్చలు ఇంకా మొదలుకాలేదు.
ఏకైక మార్గం చర్చలే!
ఫిబ్రవరి తొలి వారంలోనే రెండో విడత ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉండగా ఇప్పటికీ వాటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన హమాస్ సంస్థ మిగిలిన బందీల విడుదలకు ఉన్న ఏకైక మార్గం చర్చలేనని, ఒప్పందానికి కట్టుబడి ఉండాలని సూచించింది. ఒకవేళ ప్రస్తుత ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ వైదొలిగితే బందీలు, వారి కుటుంబాలు చాలా బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
15 నెలల యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలుకుతూ అమెరికా, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆరు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే ఇటీవల ఒప్పందం కొనసాగడంపై అనిశ్చితి ఏర్పడింది. అందరి ముందు ప్రదర్శన చేస్తూ బందీలను విడుదల చేయడం వారిని అవమానించడమేనని ఆరోపిస్తూ 600 మంది పాలస్తీనా ఖైదీల విడుదలను నెతన్యాహు నిలిపివేశారు.

ఖతర్ చొరవ
ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న హమాస్, ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టింది. అయితే ఖతర్ జోక్యంతో నలుగురు ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను ఎలాంటి ప్రదర్శన లేకుండా హమాస్ అప్పగించింది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. తద్వారా ఒప్పందం నుంచి ఇరుపక్షాలు వైదొలగకుండా చూడడంలో ఖతర్ చొరవ చూపింది.
పాలనాపరమైన శక్తి ధ్వంసం: నెతన్యాహు
తొలి విడత ఒప్పందంలో భాగంగా 8 మృతదేహాలు, 33 మంది బందీలను హమాస్ అప్పగించగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెట్టింది. ఆరు వారాల ఒప్పందం ఈ వారాంతానికి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు రెండో విడత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ తెలిపారు. బందీలందరినీ విడిపించి హమాస్ సైనిక, పాలనాపరమైన శక్తిని ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు చెప్పారు. ఇందుకు ట్రంప్ యంత్రాంగం మద్దతు ప్రకటించింది. అయితే యుద్ధం మొదలు పెట్టకుండా హమాస్ సామర్థ్యాన్ని ఎలా ధ్వంసం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాల్పుల విరమణ, ఇతర ఒప్పందాల ద్వారా దాదాపు 150 మంది బందీలను ఇప్పటివరకు హమాస్ అప్పగించింది. గాజాలో చేపట్టిన యుద్ధంలో డజన్ల కొద్దీ బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. మరో 9 మందిని ప్రాణాలతో కాపాడింది. హమాస్ చెరలో ఇంకా 59 మంది బందీలు ఉండగా వారిలో 32 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగిలిన వారిలో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 48 వేల మంది వరకు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో పౌరులు ఎందరు హమాస్ సభ్యులు ఎంతమంది అనేది స్పష్టతలేదు. అయితే IDF దాడుల్లో చనిపోయిన వారిలో సగం మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా దాదాపు 90శాతం నేలమట్టమైంది. మౌలిక వసతులు, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యాయి.