Side Effects of Fairness Creams : ప్రస్తుత రోజుల్లో చాలా మంది అందం, స్కిన్ ప్రొటెక్షన్ కోసం రకరకాల ఫెయిర్‌నెస్ క్రీములను యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీకు కూడా రెగ్యులర్‌గా ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడే అలవాటు ఉందా? అయితే, ఇది మీకో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఫెయిర్‌నెస్ క్రీముల వాడకంపై ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ క్రీములలో ఉపయోగించే హానికరమైన రసాయనాల కారణంగా కిడ్నీలు(Kidneys) త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడైంది. అంతేకాకుండా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో రోజుకో పేరుతో నయా ఫెయిర్‌నెస్ క్రీములు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ క్రీముల్లో హానికర రసాయనమైన పాదరసంను ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. నిజానికి ఇది చాలా విషపూరితమైనది. ఇదిలా ఉంటే.. ఇటీవల 'కిడ్నీ ఇంటర్నేషనల్' అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఫెయిర్‌నెస్ క్రీములలో అధిక పాదరసం కంటెంట్ ఉపయోగిస్తున్నట్లు, దీని కారణంగా మెంబ్రానస్ నెఫ్రోపతి(ఎంఎన్) కేసులు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మెంబ్రానన్ నెఫ్రోపతి అనేది ఒక అటో ఇమ్యూన్ డిసీజ్.
అలాగే ఫెయిర్‌నెస్ క్రీములలో ఉండే పాదరసం మూత్రపిండాల ఫిల్టర్లను దెబ్బతీసి, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా, ఇది మూత్రంలో ఎక్కువ ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందట. ఈ అధ్యయనం చేపట్టిన పరిశోధకులు.. 2021 జులై నుంచి 2023 సెప్టెంబర్ మధ్య కాలంలో నమోదైన 22 మెంబ్రానస్ నెఫ్రోపతి (ఎంఎన్) కేసులను పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న కేరళకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సజీష్ శివదాస్.. ఫెయిర్‌నెస్ క్రీముల్లో వాడే పాదరసం కారణంగా కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు.
పాదరసం ఒక్కటే కాదు.. ఫెయిర్‌నెస్ క్రీముల్లో హైడ్రోక్వినోన్ అనే హానికరమైన రసాయనాన్ని యూజ్ చేస్తున్నారట. దీని కారణంగా చర్మ చికాకు, అలెర్జీలు, దీర్ఘకాలిక ఉపయోగం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. కొన్ని ఫెయిర్‌నెస్ క్రీమ్‌లలో స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారట. వీటి దీర్ఘకాలిక ఉపయోగం వల్ల.. చర్మం పలుచబడటం, స్ట్రెచ్ మార్కులు, రక్త నాళాల వాపు వంటి దుష్ప్రభావాలు సంభవించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
ఈ అలవాట్లు ఫాలో అయ్యారంటే - అద్దిరిపోయే అందం మీ సొంతం!
ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..
ప్యాచ్ టెస్ట్ చేయండి : కొత్త ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆపై యూజ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. అంటే.. మీ మోచేయి లోపలి వైపున కొద్దిగా క్రీమ్ అప్లై చేసి 24 గంటల పాటు ఉంచితే ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోతే అప్పుడు యూజ్ చేయడం.
ఓవర్‌యూజ్ చేయవద్దు : అలాగే సూచించిన మోతాదు కంటే ఎక్కువ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించవద్దంటున్నారు నిపుణులు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించడం బెటర్ అంటున్నారు.
వైద్యుడిని సంప్రదించండి : మీకు ఏదైనా చర్మ సమస్య లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ముఖ్యంగా మీరు ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ఫేస్ మిలమిలా మెరవడం గ్యారంటీ!