Rosacea Causes and Symptoms in Telugu : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో చాలా మంది రకరకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అందులో ముఖం రెడ్‌గా మారడం, మొటిమలు వంటివి ఉంటాయి. అయితే.. ముఖంపై మొటిమలు మాదిరిగా కనిపించే.. రోసేసియా కూడా ఈ జాబితాలో ఉంది. మరి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి? నివారణ చర్యలు వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రొసేసియా అంటే ఏమిటి: రోసేసియా అనేది ముఖం మీద కనిపించే ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఇది ముఖం ఎర్రబడటం, చిన్న చిన్న రక్తనాళాలు కనిపించడం, ముక్కు పెద్దదవ్వడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖం మీద ఉండే ఈ పొక్కులు చూడటానికి మొటిమలుగా కనిపించినా.. అవి రొసేసియా వల్ల వస్తుంటాయని నిపుణులు అంటున్నారు.
రొసేసియా రకాలు:
- ఎరిథెమాటోటెలాంజిక్టాటిక్ రోసేసియా: ఇది రోసేసియాలో అత్యంత సాధారణ రకమని నిపుణులు అంటున్నారు. ముఖం ఎర్రబడటం, చిన్న చిన్న రక్తనాళాలు కనిపించడం ఇందులోని ప్రధాన లక్షణాలంటున్నారు. ముఖం మధ్య భాగంలో, ముక్కు, చెంపలు, నుదుటిపై ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు.
- పాపులోపస్టులర్ రోసేసియా: ఈ రకంలో ముఖం మీద మొటిమలు, పుండ్లు ఏర్పడతాయని అంటున్నారు. ఇది మొటిమలను పోలి ఉంటుందని కానీ మొటిమల కంటే ఎక్కువగా మంట, ఎర్రదనం ఉంటుందని అంటున్నారు.
- ఫైమాటస్ రోసేసియా: ఈ రకంలో ముక్కు చర్మం మందంగా మారి పెద్దగా కనిపిస్తుందని అంటున్నారు. ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు.
ఎవరికి వస్తుంది? : ఈ రొసేసియా అనేది సాధారణంగా అందరికీ వస్తుందని.. కానీ కొద్దిమందికి మాత్రం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. వారు..
- సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం
- కుటుంబంలో ఎవరికైనా రోసేసియా ఉంటే అది వారి కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.
- తెల్లని చర్మం ఉన్నవారికి రోసేసియా వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు. ముదురు రంగు చర్మం ముఖం ఎర్రబడకుండా కాపాడుతుందని అంటున్నారు.
- పురుషుల కంటే మహిళల్లో రోసేసియా ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
రొసేసియా లక్షణాలు: రొసేసియా లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవని నిపుణులు అంటున్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయని చెబుతున్నారు.
- ముందుగా ముఖం రెడ్ కలర్లోకి మారుతుందని.. కాలక్రమేణా ఎరుపు రంగు ఎక్కువవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ముఖం మధ్య భాగంలో, బుగ్గులు, నుదురు మీద ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం స్పష్టం చేస్తోంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- ముఖం మీద చిన్న చిన్న ఎర్రటి లేదా నీలం రంగులో ఉండే రక్తనాళాలు కనిపిస్తాయని అంటున్నారు.
- కొంతమందిలో ముక్కు చర్మం మందంగా మారి పెద్దగా కనిపిస్తుందని.. ఇది తీవ్రమైన లక్షణాలలో ఒకటంటున్నారు. పురుషులలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
- ముఖం మీద ఎరుపు రంగు ఉన్న ప్రదేశంలో చిన్న చిన్న మొటిమలు లేదా పుండ్లు ఏర్పడతాయి. ఒక్కొసారి చీము కూడా ఏర్పడుతుంది.
- కొంతమందిలో కళ్లు ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మండటం, దురద, కనురెప్పలు ఉబ్బి, కనురెప్పల అడుగుభాగంలో ఎర్రగా మారడం వంటివన్నీ రొసేసియా లక్షణాలుగా చెప్పవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే దృష్టి కోల్పోవడం జరుగుతుందని అంటున్నారు.
రొసేసియా కారణాలు: రోసేసియాకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ.. ఈ చర్మ వ్యాధికి దారితీసే కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అవేంటంటే..
- కుటుంబంలో ఎవరికైనా రోసేసియా ఉంటే.. అది వారి కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం అంటున్నారు.
- ఎండ, గాలి, చలి వంటివి రోసేసియాను తీవ్రతరం చేయవచ్చని చెబుతున్నారు.
- కొన్ని రకాల బ్యాక్టీరియా.. ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా రోసేసియాను ప్రేరేపించవచ్చని చెబుతున్నారు.
- కారంగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కెఫెన్ వంటివి రోసేసియా లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు.
- ఒత్తిడి, ఆందోళన రోసేసియాను మరింత తీవ్రతరం చేస్తుందని అంటున్నారు.
- కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మాన్ని చికాకు పెట్టి రోసేసియాను తీవ్రతరం చేయవచ్చని చెబుతున్నారు.
నివారణ చర్యలు: రొసేసియాకు పూర్తి నివారణ లేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల దాని తీవ్రతను తగ్గించవచ్చంటున్నారు.
- ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం ఉత్తమమంటున్నారు.
- చల్లని నీటితో ముఖం కడుక్కోవడం మంచిదంటున్నారు.
- చర్మాన్ని చికాకు పెట్టే రసాయనాలు లేని మృదువైన క్లీనర్‌లను ఉపయోగించండి.
- మసాలా ఆహారం, ఆల్కహాల్, కెఫిన్ తగ్గించాలి.
- నిద్ర లేకపోవడం వల్ల రోసేసియా లక్షణాలు పెరగవచ్చు. కాబట్టి సరిపడా నిద్ర పోవడం మంచిది.
- యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టీనేజీ అమ్మాయిల్లో మొటిమలు ఎందుకొస్తాయ్?- పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జిడ్డు సమస్య వేధిస్తోందా? - నిపుణులు సూచిస్తున్న టిప్స్ ఇవే!