Balanced Diet in Telugu For Students During Exams : పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం ఇది. పది, ఇంటర్ విద్యార్థులు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. ఉత్తమ గ్రేడ్, మార్కులు రావాలని ఆహారం, నిద్రను కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు ఈ సమయంలో పిల్లలను పట్టించుకోవాలి. విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపునకు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశంపై వైద్య నిపుణులు జనరల్ ఫిజిషియన్ రాగవేణి, పోషకాహార వైద్యులు సూచనలిచ్చారు. మరి అవేంటో చూద్దామా?
ఉదయం కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. అందులో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఉండేలా చూసుకోవాలి. దోశ, ఇడ్లీ, వడ, ఊతప్పం, పెసరట్టు వంటివి మంచిది. వీటిలో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. పల్లి చట్నీ శరీరానికి రక్షణగా పని చేస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంత్రం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. భోజనాన్ని 75 శాతం తీసుకోవాలి. 25 శాతం ఖాళీ కడుపుతో ఉండాలి. ఎత్తు, వయసుకు తగిన సమతులాహారం ఉండాలి.
జంక్ ఫుడ్ పక్కన పెట్టాలి : శీతల పానీయాలు, ఐస్‌క్రీంలు, చిప్స్, బర్గర్లు, నూడుల్స్, స్వీట్లు, సమోసాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకునే ఆహారం తీసుకోవాలి. పరీక్షలు పూర్తయ్యేవరకు బయట ఫుడ్ తినకుండా ఉంటే మంచిది. ప్రధానంగా బొబ్బర్లు, ఉడికించిన కోడిగుడ్లు, శనగలు, వాల్‌నట్స్, బాదం, పిస్తా, పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మొలకెత్తిన, నానబెట్టిన గింజలు, పల్లి పట్టీలు, నువ్వుల లడ్డు, గుమ్మడి గింజలు, క్యారెట్, బీట్రూట్, నిమ్మరసం, చెరకు రసం, రాగిజావ, అంబలి, కీర, దోస, మజ్జిగలను తీసుకోవడం మంచిది. పాలిష్ పట్టని బియ్యం అన్నానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదుర్దాను ఇవి తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్లు తీసుకోవచ్చు. ఈ పదార్థాలు జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి.
వాటి నియంత్రణపై అవగాహన : కారం, పులుపు, నూనెలు, మసాల వినియోగం తగ్గించాలి. పిల్లలకు కచ్చితంగా ఉప్పు వినియోగంలో నియంత్రణపై అవగాహన పెంచాలి. వాటి వినియోగం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన ఉంటే మంచి అలవాట్లు అలవడతాయి.
మేలు చేసే తాజా : కాలానుగుణంగా తాజాగా ఉండే పండ్లు మాత్రమే తినాలి. ఆకుకూరలు తీసుకోవాలి. పండ్లను వివిధ రంగుల్లోనివి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థకు చక్కగా పనిచేస్తాయి.
ప్రశాంతంగా నిద్ర : ప్రతి రోజు రాత్రికి 10 గంటల లోపు నిద్రపోయిస తెల్లవారుజామున 4 గంటలకు లేచే అలవాటు చేసుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకొని చదువు కొనసాగించాలి. తెల్లవారుజాము మనసు ప్రశాంతంగా ఉంటుంది. కనీసం రోజుకు 6 లీటర్ల నీటిని తాగాలి. శరీరంలో డీహైడ్రేషన్ అయి కళ్లు తిరిగే ప్రమాదం ఉంటుంది. మాంసాహారం మితంగా తీసుకోవాలి. కొద్ది నిమిషాల పాటు నడక, యోగా, ధ్యానం చేయాలి. సరిపోయేంత నిద్ర లేక పరీక్షల సమయంలో ఆరోగ్యం దెబ్బతింటుంది.
"పది, ఇంటర్ విద్యార్థులు మంచి ఆహారం, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. ఒకే సమయాలు పాటించాలి. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది." - బాలస్వామి, పోషకాహార నిపుణుడు, సంగారెడ్డి
దగ్గరి బంధువులు ఆహ్వానించినపుడు విందులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా విందుల్లోనూ మితంగా ఆహారం స్వీకరించాలి. వీలైనంత వరకు శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అరగకపోతే కడుపునొప్పి బాధిస్తుంది.
"అభ్యసనం, సాధనపై నమ్మకం ఉంచాలి. ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలి. ఎక్కువ సమయం చదువుతూ ఉంటే మనసు అలసిపోతుంది. మతిమరుపు వస్తుంది. మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి. చదవడమైనా, పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చదివేటపుడైనా ప్రశాంతంగా ఉండాలి." - రాగవేణి, జనరల్ ఫిజీషియన్, సంగారెడ్డి
ఇకపై ఏటా 2సార్లు CBSE పదో తరగతి పరీక్షలు- మరి ప్రాక్టికల్స్ మాటేమిటి?
'పది'లో వెనుకబడిన విద్యార్థులకు టీసీలు - ఆ ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంల నిర్వాకం
పరీక్షల ఒత్తిడిలో ఉన్నారా? - ఈ టిప్స్ పాటించారంటే కూల్‌గా రాసేయొచ్చు!