Pre Approved Personal Loans : చాలా మంది ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇతరులకు ఈ ఆఫర్లు వచ్చాయని తెలిసిన వెంటనే, బ్యాంకుల కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తమకూ అలాంటి ఆఫర్లు ఏవైనా ఉన్నాయా? అని ఆరా తీస్తుంటారు. అసలు ఏమిటీ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు? వాటితో ప్రయోజనమేంటి? ఈ ఆఫర్లను పొందడం ఎలా? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈమెయిల్స్, యాప్ నోటిఫికేషన్లు, ఎస్ఎంఎస్‌లు
చాలా మందికి బ్యాంకుల నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు వస్తుంటాయి. ఈ మేరకు సమాచారంతో ఈ-మెయిల్స్, యాప్ నోటిఫికేషన్లు, ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు అందుతుంటాయి. వాటిని చూడగానే, ఆర్థిక అవసరాలున్నవారు లోన్ తీసుకుంటారు. ఈ తరహా లోన్లకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులో కొన్ని బ్యాంకులు రాయితీ ఇస్తుంటాయి. ఇంకొన్ని బ్యాంకులు ఈ ఫీజును పూర్తిగా మినహాయిస్తుంటాయి. మంచి సిబిల్ స్కోరు కలిగిన వారికి అతి తక్కువ వడ్డీరేటుతో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు వస్తాయి.
ఏమిటీ ప్రీ అప్రూవ్డ్ లోన్?
ప్రీ అప్రూవ్డ్ లోన్ పేరులోనే విషయమంతా ఉంది. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ముందస్తుగా మీ కోసం ఆమోదించిన లోన్ ఆఫర్ అది. అంటే సదరు బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ మీ ప్రొఫైల్‌ను ముందే సమగ్రంగా తనిఖీ చేసిందన్న మాట. మీరు రుణం పొందడానికి అర్హులే అని నిర్ధరించుకుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాతే మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ మెసేజ్‌ను పంపింది. మీ కేవైసీ, క్రెడిట్ స్కోర్, రుణాల చెల్లింపు ట్రాక్ రికార్డు, ఆదాయ వనరులు వంటి సమాచారాన్ని జల్లెడ పట్టిన తర్వాతే ఈ లోన్ ఆఫర్ ఇస్తారు. అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఈ రుణాన్ని వేగంగా మంజూరు చేస్తారు.
ప్రీ అప్రూవ్డ్ లోన్ ప్రయోజనాలు ఇవే!
- తక్కువ వడ్డీరేటు : ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ అనేక ప్రయోజనాలతో వస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే ఈ రుణాన్ని ఇస్తారు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇచ్చేందుకు బ్యాంకు ఎంపిక చేసుకున్న వారంతా ఆర్థికంగా మంచి ట్రాక్ రికార్డు కలిగినవారే. ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తారు. లేదంటే తగ్గిస్తారు.
- డాక్యుమెంటేషన్ లేదు : చాలా బ్యాంకులు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే ప్రీ అప్రూవ్డ్ లోన్‌ను మంజూరు చేస్తాయి. ఎందుకంటే బ్యాంకు వద్ద సదరు ఆఫర్ పొందిన వ్యక్తికి సంబంధించిన కేవైసీ రికార్డు అప్పటికే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాంకు వద్ద సదరు వ్యక్తి అప్పటికే రుణాన్ని తీసుకొని ఉంటే, అతడి ఆదాయ వివరాలు సైతం బ్యాంకు వద్ద ఉంటాయి. అందుకే డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు.
- తక్షణ మంజూరు : ప్రీ అప్రూవ్డ్ లోన్‌ను వెంటనే మంజూరు చేస్తారు. ఈ క్రమంలో రుణ కాలవ్యవధి, ఈఎంఐలపై రుణగ్రహీత తుది నిర్ణయం తీసుకోవచ్చు. రుణగ్రహీత ఆమోదం లభించిన వెంటనే, అతడి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.
ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందడం ఎలా?
- ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్‌ను ఇవ్వడం అనేది బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఇష్టం.
- బ్యాంకు దృష్టిలో పడేందుకు మీరు క్రెడిట్ స్కోరును పెంచుకోండి. 700 నుంచి 750 మధ్యలో లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉండేలా చూసుకోండి.
- ఇప్పటికే ఉన్న రుణాల ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులను సకాలంలో చెల్లించండి.
- మరిన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయకండి.
- మీ ఆదాయంలో రుణాల చెల్లింపు వాటా అనేది 36 శాతంలోపు ఉండేలా జాగ్రత్తపడండి.
- ఇలాంటి అంశాలను పాటిస్తూ మీరు ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకుంటే తప్పకుండా భవిష్యత్తులో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు వస్తాయి.
తక్కువ వడ్డీతో 'మల్టీపర్పస్ లోన్'- గ్యారెంటీ అవసరం లేదు- అప్లై చేసిన వెంటనే చేతికి డబ్బులు!
గుడ్ న్యూస్- ఇకపై బ్యాంక్ లోన్స్ ముందే కట్టేసినా ఛార్జీలు ఉండవ్! RBI నయా రూల్!