Home Loan For Under Construction Property : సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. దీన్ని నెరవేర్చుకోవడానికి అందరూ నిత్యం శ్రమిస్తుంటారు. కొంతమంది ఇల్లు నిర్మాణ దశలో ఉండగా గృహ రుణానికి (హోం లోన్) దరఖాస్తు చేస్తుంటారు. ఈ విధంగా అప్లికేషన్‌ను సమర్పించే వారు గుర్తుంచుకోవాల్సిన మౌలిక అంశాలను మనం తెలుసుకుందాం.
దరఖాస్తు ప్రక్రియ : నిర్మాణ దశలో ఉన్న ఇంటి కోసం మనం హోం లోన్ తీసుకోవచ్చు. దీని కోసం దరఖాస్తు చేసే క్రమంలో ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఐడీ ప్రూఫ్, చిరునామా ధ్రువపత్రాలు, ఆదాయపు సమాచారం, ఆస్తి పత్రాలను బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి అందించాలి.
లీగల్, టెక్నికల్ వెరిఫికేషన్ : నిర్మాణ దశలో ఉన్న ఇంటికి చట్టబద్ధత ఉందా? లేదా? అనేది బ్యాంకు తనిఖీ చేస్తుంది. సంబంధిత పత్రాలన్నీ పరిశీలిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నారా, లేదా అనేది బ్యాంకు అధికారులు నిర్ధరించుకుంటారు. టెక్నికల్‌గా ఆ ఇంటి నిర్మాణ ప్రక్రియ సవ్యంగానే ఉందా లేదా అనేది తెలుసుకుంటారు.
రుణ ఒప్పందం : హోం లోన్‌ను మంజూరు చేయగానే, రుణ ఒప్పందంపై రుణగ్రహీత సంతకాలు చేయాలి. వడ్డీరేట్లు, ఈఎంఐ కాల వ్యవధి, మంజూరయ్యే రుణ మొత్తం, ప్రాసెసింగ్ ఫీజు, షరతులు వంటి వివరాలన్నీ ఒప్పందంలో ఉంటాయి.
రుణ పంపిణీకి వినతి : ఇల్లు నిర్మాణ దశలో ఉన్నందున వెంటనే రుణాన్ని పంపిణీ చేయాలంటూ రుణగ్రహీత ఒక దరఖాస్తును బ్యాంకుకు సమర్పించాలి. ఇంటిని నిర్మిస్తున్న బిల్డర్ నుంచి పొందిన డిమాండ్ లెటర్‌ను కూడా బ్యాంకుకు ఇవ్వాలి. ఇంటి నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చాయి? మిగతా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకెన్ని నిధులు కావాలి? అనే సమాచారం ఈ డాక్యుమెంట్లలో ఉంటుంది.
విడతల వారీగా రుణ పంపిణీ : ఇప్పటికే నిర్మించి ఉన్న ఇంటిని కొనేటప్పుడు ఏకకాలంలో హోం లోన్‌ను మంజూరు చేస్తారు. అయితే నిర్మాణ దశలో ఉన్న ఇంటి కోసం విడతల వారీగా గృహ రుణాన్ని విడుదల చేస్తుంటారు. ఇంటి పనిని బిల్డర్ చేస్తున్న కొద్దీ, రుణం నిధులు బ్యాంకు నుంచి విడుదల అవుతుంటాయి. రుణ నిధులను సమర్ధంగా వినియోగించాలనే ఉద్దేశంతోనే ఇలా వివిధ విడతల్లో పంపిణీ చేస్తుంటారు.
ప్రీ ఈఎంఐ చెల్లింపులు : ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు రుణగ్రహీత ప్రీ-ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ప్రీ-ఈఎంఐ అంటే రుణంపై వడ్డీ. ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యాకే రుణం అసలును ఈఎంఐల రూపంలో ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారు మొదటి నెల నుంచే రుణం అసలును చెల్లించడం మొదలుపెట్టొచ్చు.
ఇవి గుర్తుంచుకోండి
- సరైన బిల్డర్‌ను ఎంచుకోండి : మీ ఇంటి నిర్మాణం కోసం మంచి ట్రాక్ రికార్డు కలిగిన బిల్డర్‌ను ఎంచుకోండి. బిల్డర్ రికార్డ్ బాగా ఉంటే రుణ మంజూరు సులభతరం అవుతుంది.
- రుణ చెల్లింపులో సౌలభ్యం : ఇల్లు నిర్మాణదశలో ఉండగా రుణాన్ని తీసుకుంటున్నారు కాబట్టి, ఈఎంఐలను ముందుచూపుతో ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతినెలా ఎంత చెల్లించగలరు? ఎన్ని నెలల్లో రుణాన్ని తీర్చగలరు? అనేది మీ ఆర్థిక సామర్థ్యాన్ని, ఆదాయ స్థాయిని బట్టి నిర్ణయించుకోండి.
- వడ్డీరేటు : వీలైనంత తక్కువ వడ్డీరేటుకు రుణం ఇచ్చే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీని ఎంచుకోండి. ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.