Truck Rams Into Marriage Procession : మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్ జిల్లాలో వివాహ ఊరేగింపుపైకి వేగంగా వస్తున్న ట్రక్కు దూసుకెళ్లడం వల్ల ఐదుగురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఘాట్ పిపారియా గ్రామంలో భోపాల్- జబల్పుర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
టైరు మార్చుతుండగా ఢీకొట్టిన కారు
Haryana Road Accident : హరియాణాలోని రేవారీలో సోమవారం(మార్చి 11) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పంక్చర్ అయిన కారు టైరు మారుస్తుండగా వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రులను చికిత్స కోసం రేవారీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ధరుహెరా రోడ్డులోని మసాని బస్టాండ్ వద్ద ఇన్నోవా కారు పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ రోడ్డు పక్కన కారు ఆపి టైరు మారుస్తున్నాడు. అప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు అక్కడే నిలబడి ఉన్నారు. అంతలో రేవారివైపు నుంచి వస్తున్న ఎస్యూవీ కారు పంక్చర్ అయిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కారు పక్కనవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో నలుగురు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.