Mallikarjun Kharge On Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలిచి అధికార పీఠంపైకి వస్తే దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీలాంటి పార్టీ వల్ల దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందన్నారు. సోమవారం ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేత హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయించేందుకు అత్యుత్సాహాన్ని చూపించిన ప్రధాని మోదీ - అదానీ, అంబానీల వంతు వచ్చే సరికి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
అదానీ, అంబానీల నుంచి రాహుల్ గాంధీ టెంపోల నిండా డబ్బుకట్టలు తెచ్చుకున్నారని ప్రధాని మోదీ గతంలో తప్పుడు ఆరోపణలు చేశారని ఖర్గే మండిపడ్డారు. ఇవే ఆరోపణల వ్యవహారంలో అదానీ, అంబానీలను అరెస్టు చేయించే ధైర్యం మోదీకి లేదన్నారు. ఎన్నికల బాండ్లను కొని బీజేపీకి చందాలు ఇచ్చిన వాళ్లకే దందాలు (కాంట్రాక్టులు) ఇచ్చిన కల్చర్ పీఎం మోదీది అని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు అరెస్టు చేయించిన విపక్ష నేతలందరికీ విముక్తి లభిస్తుందని వెల్లడించారు. బీజేపీ, ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఖర్గే వ్యాఖ్యానించారు.
మోదీజీకి అదానీ, అంబానీ కావాలి - మాకు ప్రజలు కావాలి : రాహుల్ గాంధీ
అదానీ , అంబానీల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ పనిచేస్తుంటారని, కానీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తమ కుటుంబం పని చేస్తుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తన కుటుంబానికి రాయ్‌బరేలీ ప్రజలతో బలమైన సంబంధాలు ఉన్నందువల్లే, ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ప్రధాని మోదీ దాదాపు 25 మంది బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించారని ఆరోపించారు. ఈ డబ్బుతో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 24 ఏళ్లపాటు నిధులను కేటాయించవచ్చన్నారు. రాయ్‌బరేలీలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు తన అమ్మమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీకి పేదల సమస్యల కంటే, పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లే ప్రయారిటీగా మారాయని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద కుటుంబాల జాబితాను రూపొందించి, ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ.1 లక్ష లేదా నెలకు రూ.8,500 చొప్పున బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని రాహుల్ ప్రకటించారు.
సీఎం నివాసంలో దారుణం!- ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ PA దాడి!! - Swati Maliwal Assaulted