Kejriwal ED Summons : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈనెల 26న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీచేయడం ఇది ఏడోసారి. స్థానిక కోర్టులో ఈ అంశం ఉన్నందున తాజాగా సమన్లు జారీచేయడం చట్టవిరుద్దమని కేజ్రీవాల్ చేస్తున్న వాదనలను ఈడీ తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
ఆమ్ ఆద్మీ అధినేత, ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ తమ సమన్లు పాటించడంలేదని దిల్లీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ప్రత్యక్ష హాజరు నుంచి కేజ్రివాల్ మినహాయింపు పొందారు. దిల్లీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో నిందితులపై విచారణకు తగిన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.
అయితే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో కేజ్రీవాల్ పేరును పలుమార్లు ప్రస్తావించింది. గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆప్ ఉపయోగించిందని ఛార్జ్షీటులో పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించి నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది.
ఇదీ కేసు
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖరాయడం వల్ల సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా సిసోదియా పేరును చేర్చింది. 2023 ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు.
'మళ్లీ మళ్లీ సమన్లు పంపొద్దు, అప్పటివరకు ఆగండి'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరో 'సారీ'
'బీజేపీ అధర్మం అంతమై ధర్మం గెలుస్తుంది- దేశం వెంట దేవుడు ఉన్నాడు'