Slab Collapsed in Hyderabad : కూలిన స్లాబ్.. ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు
One Person Died in Slab Collapse in Hyderabad : కూలీ పనికి వెళ్లిన కార్మికులకు విషాదం ఎదురైంది. నిర్మాణంలో తగిన నాణ్యత ప్రమాణాలు లేక స్లాబ్ కూలిపోయింది. దీంతో పనికి వచ్చిన కూలీల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుక్కుగూడా(ఫ్యాబ్ సిటీ) ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను నిర్మిస్తోంది. మూడు రోజుల క్రితం స్లాబ్‌ను వేశారు. అది కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న కూలీల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాద సమయంలో దాదాపు ఆ ప్రాంతంలో 25 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహేశ్వరం ఏసీపీ అంజయ్య తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. స్లాబ్ కూలిపోడానికి సరైన కారణాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.