Hyderabad Rains : వర్షంలో పిల్లల్ని బయటకు పంపిస్తున్నారా.. బీ కేర్‌ఫుల్
Hyderabad Rain Updates : తెలంగాణలో వాన జోరు తగ్గినా.. దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. వాగులు, వంకలు ఉరకలెత్తి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వలూ పొంగిపొర్లుతూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు వరద నీటిలో జారి పడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మణికొండలో చోటుచేసుకుంది.
మణికొండలో ఓ బాలికకు పెను ప్రమాదం తప్పింది. వెంకటేశ్వరకాలనీ, పాయనీర్‌కాలనీల మధ్య ఉన్న కల్వర్టు పై నుంచి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే పాల ప్యాకెట్ కోసం వెళ్లిన ఓ అమ్మాయి వరద ఉద్ధృతికి జారి సైకిల్‌తో సహా అందులో పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బాలికను రక్షించడంతో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణకుమార్ తెలియజేశారు. వెంటనే కమిషనర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కల్వర్టుపై రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత సంత్సరం ఇదే నాలలో పడి ఒకరు మృతిచెందారని అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.