Babli project gates Opened : బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు తెరిచిన అధికారులు
Babli project gates lifted : శ్రీ రామసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు అధికారులు తెరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్ సాగు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు. బాబ్లీ నిర్మాణ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 14 గేట్లను ఎత్తివేశారు. వాటిని అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచి ఆ తర్వాత మూసివేస్తారు.
శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1064.90 వరకు నీటిమట్టం ఉంది. 20.068 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి మరో 55 క్యూసెక్కుల వరద చేరుతుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 50, మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. బాబ్లీ గేట్లు ఎత్తడంతో తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకలను సంతరించుకుంది.