ఏరోబిక్ వ్యాయామాలు వయసును అడ్డుకోగలవన్నది తెలిసిందే. ఆనందం, సంతృప్తి కలిగించి.. కుంగుబాటు, ఆందోళనలను దూరంచేసే న్యూరోట్రాన్స్‌మిటర్ సెరటోనిన్ స్థాయులు పెరిగేందుకు ఈ వ్యాయామాలు దోహదపడతాయి. అయితే- వీటి కంటే ఈత కారణంగానే మెదడు చురుగ్గా తయారవుతుందని, గ్రహణశక్తి, అభ్యసన నైపుణ్యాలు పెరుగుతాయని టెక్సాస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీ హార్డిన్-బేలార్ ప్రొఫెసర్ సీనా మాథ్యూ తెలిపారు. తరచూ ఈతకు వెళ్లడం వల్ల జ్ఞాపకశక్తి, రోగనిరోధక స్పందనలు, మానసిక ఆరోగ్యం మెరుగవుతాయన్నారు.
ఏరోబిక్ వ్యాయామాల కంటే.. ఈతతోనే మెదడుకు పదును! - ఈతతో మెదడుకు పదును
ఏరోబిక్ వ్యాయామాల కంటే ఈత కారణంగానే మెదడు చురుగ్గా తయారవుతుందని, గ్రహణశక్తి, అభ్యసన నైపుణ్యాలు పెరుగుతాయని టెక్సాస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీ హార్డిన్-బేలార్ ప్రొఫెసర్ సీనా మాథ్యూ తెలిపారు. తరుచూ ఈతకు వెళ్లడం వల్ల జ్ఞాపకశక్తి, రోగనిరోధక స్పందనలు మెరుగవుతాయన్నారు.
"మనిషి మెదడులో అసంఖ్యాకంగా న్యూరాన్లు, వాటి మధ్య సినాప్టిక్ కనెక్షన్లు ఉంటాయి. ఏ కారణం వల్లనైనా ఇవి ఒకసారి దెబ్బతింటే ఇక మళ్లీ సాధారణ స్థితికి రాలేవని 1960ల్లో భావించేవారు. కానీ, ఏరోబిక్ వ్యాయామాలతో ఈ నష్టం నుంచి కోలుకోవచ్చని ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో రూఢి అయింది. ఈ వ్యాయామాల కారణంగా బ్రెయిన్-డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ప్రొటీన్ స్థాయులు పెరిగి, జ్ఞాపకశక్తికి కీలకమైన మెదడులోని హిపోకమస్ పరిమాణం పెరుగుతున్నట్టు తేలింది. ఆందోళన, వ్యాకులత నుంచి బయట పడటానికి కూడా ఈ ప్రొటీన్ దోహదపడుతుంది. అయితే- గుండెను బలోపేతం చేసే ఈత వల్ల మెదడు ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగవుతుంది. స్వల్పకాల, దీర్ఘకాల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులు కొత్త విషయాలను నేర్చుకునేందుకూ స్విమ్మింగ్ దోహదపడుతోంది. ఈత కారణంగా శరీరంలో ఈ మార్పులు ఎలా చోటుచేసుకుంటున్నాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే. ఈ రహస్యం వెల్లడయ్యే సమయం దగ్గర్లోనే ఉంది" అని సీనా మాథ్యూ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పొట్ట చుట్టూ చెడు కొవ్వు పేరుకుపోయిందా..? ఇలా తగ్గించేయండి