Remedy For Ribs Pain : మనలో చాలా మందికి నడుస్తున్నప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో, వాలీబాల్ వంటి ఆటలు ఆడుతున్నప్పుడో పక్కటెముకుల్లో నొప్పి వస్తుంటుంది. ఇలా అకస్మాత్తుగా వచ్చే నొప్పితో విలవిల్లాడిపోతుంటాం. పక్కటెముకులు పట్టేయడం వల్లే ఈ నొప్పి వస్తుందని సాధారణంగా అనుకుంటుంటాం. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుంది? పక్కటెముకుల్లోనే నొప్పిరాడానికి కారణాలేంటి? వీటికి పరిష్కార మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం.
పక్కటెముక ఎందుకు పట్టేస్తుంది?
ఏదైనా పనిచేస్తున్నప్పుడు, పొద్దున్నే పక్కపై నుంచి లేచినప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు పక్కటెముకు పట్టేయడం, బాధపెట్టడం మనలో చాలా మందికి అనుభవమే. పక్కటెముకుల్లో నొప్పి ప్రమాదకరమేమీ కాదు. రోజువారీ సమస్యే. కానీ, నొప్పిగా ఉన్నంతసేపు అసౌకర్యం కలిగిస్తుంది. ఇంతకీ దీనికి కారణమేంటో తెలుసా? కడుపును ఛాతీని వేరు చేసే డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించడం.
డయాఫ్రం సంకోచించడానికి అనేక కారణాలు
డయాఫ్రం పొర ఉన్నట్టుండి సంకోచించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కాలేయానికి, ప్లీహానికి రక్తసరఫరా ఎక్కువ కావడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తుంటారు. లోపల అవయవాలు డయాఫ్రం పొరను కిందకి లాగడం వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు అని వైద్యులు అంటున్నారు. తిన్న వెంటనే శారీరక శ్రమతో కూడిన పని చేయడం వల్ల కూడా డయాఫ్రం పొర సంకోచించడానికి కారణం కావొచ్చు. ఎందుకంటే తిన్నతర్వాత ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ రక్తం సరఫరా చేస్తుంది. ఫలితంగా డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గుతుంది. రక్తంలో కాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు తగ్గడమూ ఓ కారణం కావచ్చు.
పక్కటెముక పట్టేసినప్పుడు ఏం చేయాలి?
పక్కటెముక పట్టేసినప్పుడు చేస్తున్న పనులు అప్పటికప్పుడు మానేయటం సాధ్యం కాకపోవచ్చు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలా? వేగంగా నడవడం, పరుగెత్తడం చేస్తుంటే కాస్త వేగం తగ్గించాలి. గాఢంగా గాలి పీల్చుకుంటే కండరాలు వదులై నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. పట్టేసిన డయాఫ్రం సడలుతుంది. నొప్పి వస్తున్న చోటును గుర్తించి వేలితో కాసేపు అదిమి పట్టిన నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.