High Protein Diet Health Benefits : అధిక బరువు వల్ల అనేక నష్టాలున్నాయి. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. వాటిల్లో హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా ఒకటి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా వరకు ఆకలి తగ్గుతుంది. ఫలితంగా మరలా వెంటనే ఆహారం తీసుకునే అవసరం ఉండదు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. అయితే చెడు కొవ్వు తక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం.
స్థూలకాయానికి కారణం
Obesity Causes : రిఫైన్ చేసిన పదార్థాలు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకునే వాళ్లకు స్థూలకాయం వస్తుంది. ఇలాంటి పదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శక్తి తగినంత వినియోగం కాకుండా పోతుంది. ఫలితంగా అది కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది ఇలాగే కొనసాగడం వల్ల క్రమంగా బరువు పెరుగుతాం. కార్బోనేటెడ్ బేవరేజెస్, జ్యూసులు, స్వీట్లు, కేక్స్, పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారికి, బాగా పాలిస్ చేసిన అన్నం తినేవాళ్లకి స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఈ కార్బోహైడ్రేట్స్ మోతాదును తగ్గిస్తూ.. హై ప్రోటీన్ ఆహారం తీసుకుంటే.. బరువు తగ్గడం సులువు అవుతుంది.
స్థూలకాయంతో వచ్చే సమస్యలు
Over Weight Diet Plan : అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా దీని వల్ల డయాబెటిస్, బీపీ, జీర్ణ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. వయస్సుకు, ఎత్తుకు తగినంత బరువు ఉండటం వల్ల శరీర అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడానికి మన ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే (హై ప్రోటీన్ ఫుడ్) పదార్థాలను చేర్చుకోవాలి. ప్రోటీన్ల వల్ల కలిగే ఉపయోగాల్లో బరువు తగ్గించడం కూడా ఒకటి. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి.. చాలా సమయం వరకు ఆకలేయదు.
హై ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలివే..!
Protein Rich Foods : ప్రోటీన్లు ఉన్న ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు అవసరం. అయితే, వీటిని మన శరీరం తనంతట తాను తయారు చేసుకోలేదు. కనుక ఆహారం ద్వారానే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి దొరికే పదార్థాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నప్పటికీ.. మాంసాహారం ద్వారా ప్రోటీన్లు చాలా వరకు అందుతాయి. చేపలు, కోడిమాంసం, మేక మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ప్రోటీన్లను పూర్తి స్థాయిలో పొందగలుగుతాము.