యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలుస్తోంది. గత సంవత్సరం కేవలం 28 మంది మాత్రమే విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో.. ఉపాధ్యాయుల అంకితభావం, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ సంవత్సరం 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా మొక్కుబడిగా బోధన చేయకుండా.. నిబద్ధతతో పనిచేస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.
గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న స్పైకా లాబొరేటరీ సంస్థ ఈ పాఠశాలలోని ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల బోధన కోసం ప్రత్యేకంగా ఒక విద్యావాలంటీరును నియమించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజ్ తెలిపారు. మరో విద్యా వాలంటీరును ఇవ్వడానికి దివిస్ లేబొరేటరీ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. పాఠశాలకి అవసరమైన ఫర్నీచర్ గ్రామస్థులు అందిస్తున్నారని.. విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, ఆట సామగ్రిని దాతలు సమకూరుస్తున్నారని తెలిపారు.
పాఠశాలలోని ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి.. పర్యవేక్షణ బాధ్యతను పిల్లలకు అప్పగించారు. పాఠశాల ఇంత సమర్థవంతంగా నడవటానికి తమ నిబద్ధతతో పాటు గ్రామస్థుల సహకారమూ తోడైందని ఉపాధ్యాయులు అంటున్నారు. గ్రామ ప్రజలకు తమపై నమ్మకం ఏర్పడిందని.. వచ్చే ఏడాది తమ పాఠశాలలో మరింత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాఠశాల గురించి తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ఈ పాఠశాలను దత్తత తీసుకుని.. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఫలితంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా బోధన చేస్తున్నారు. విద్యార్థులూ ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు.
సర్కార్ బడిలో ఎల్‌కేజీ, యూకేజీ.. ఎక్కడో తెలుసా..? ఇదీ చూడండి: పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్