5th Rank in National level to Aaleru PS: పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల సేవలో అంకితం కావాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆకాంక్షించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీసు స్టేషన్ను కేంద్ర హోం శాఖ.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఠాణాగా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమిషనరేట్‌లో అభింనందన కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు పోలీసు వ్యవస్థ.. ప్రజల ప్రశంసలతో పాటు శాఖాపరంగా అభినందనలు అందుకుంటోందని ఆయన కొనియాడారు. ఆలేరు పోలీసులు అరుదైన ఘనత సాధించడంతో.. రానున్న రోజుల్లో తెలంగాణ పోలీసుల బాధ్యతను మరింత పెంచిందని గుర్తు చేశారు.
"ఆలేరు పోలీసు స్టేషన్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు పొందడం యావత్ తెలంగాణ పోలీసులకు గర్వ కారణం. గతంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నారాయణపూర్ పోలీసు స్టేషన్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించింది. భవిష్యత్తులో ఇదేస్ఫూర్తితో పనిచేస్తూ తెలంగాణ పోలీసు ఘనతను మరింతగా ఇనుమడింపజేయాలి. తెలంగాణ పోలీసు వ్యవస్థ నిరంతరం అమూల్యమైన సేవలందిస్తుండటంతో రాష్ట్రంలో నేరాల శాతం తగ్గుతోంది. ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొనాలి." -మహేశ్ భగవత్, రాచకొండ సీపీ