కాంగ్రెస్ నేతలు తెరాస నేతలపై విమర్శలు చేయడంపై వరంగల్‌లో తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అరెస్టై వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అతనిని పరామర్శించడానికి వచ్చిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు తెరాసపై విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ నేతలపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా హన్మకొండలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీలు బండా ప్రకాశ్, దయాకర్లు పాల్గొన్నారు. రాఘవరెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తుంటే అతనిని చూడటానికి రావడం సిగ్గు చేటని వారు అన్నారు.