తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం.. ఇక సుదూరాలకు.. రైట్‌ రైట్‌!

ఆర్టీసీ సోమవారం నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభిస్తోంది. వరంగల్‌ రీజియన్‌ మొత్తం 78 అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు కొనసాగుతున్నందున ఆ రాష్ట్రానికి తప్ప మిగిలిన రాష్ట్రాలకు ఇక పరుగులు పెట్టనున్నాయి. దీంతో ఆర్టీసీ క్రమంగా పుంజుకోనుంది.

Interstate buses started in telangana
అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం.. ఇక సుదూరాలకు.. రైట్‌ రైట్‌!

By

Published : Sep 28, 2020, 2:05 PM IST

సోమవారం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వివిధ సర్వీసులను నడిపేందుకు వరంగల్‌ రీజియన్‌ సిద్ధమవుతోంది. ముంబయి, పుణెకు ఒక్కో గరుడ బస్సు సర్వీసు ఉంది. పుణెకు ఒక రాజధాని సర్వీసు గతంలో నడిచేది. వీటితోపాటు కర్ణాటకలోని రాయచూర్‌కు ఒక గరుడ సర్వీసు, భూపాలపల్లి డిపో నుంచి ఛత్తీస్‌గఢ్‌ గడ్చిరోలికి ఒక సర్వీసు, మహారాష్ట్ర సిరొంచకు బస్సులను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బెంగళూరుకు కూడా గరుడ, రాజధాని బస్సులు ఉండేవి కానీ, ఆంధ్రప్రదేశ్‌ సర్వీసులు ప్రారంభించాక బెంగళూరు సర్వీసును ప్రారంభించనున్నారు. ఇక షిర్డీకి గతంలో ఒక సర్వీసు నడిచేది.. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతో ఆ సర్వీసును ఇప్పుడే ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు.

అంతర్రాష్ట్ర సర్వీసుల వల్ల లాక్‌డౌన్‌కన్నా ముందు వరంగల్‌ రీజియన్‌కు సుమారు రూ. 12 లక్షల ఆదాయం వచ్చేది. కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా దీనికి గండిపడింది. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఆంధ్రప్రదేశ్‌కే అత్యధికంగా ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నిత్యం వరంగల్‌ రీజియన్‌ నుంచి బస్సులు రాకపోకలు సాగించేవి.

క్రమంగా కోలుకుంటూ

కరోనా ప్రభావంతో ఆర్టీసీీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్‌ రీజియన్‌లో కరోనాకన్నా ముందు రోజుకు రూ. 1.2 కోట్ల అదాయం ఉండేది. కొవిడ్‌ వల్ల రీజియన్‌ నష్టాల్లో మునిగింది. సర్వీసులు మొదలైనా ఇప్పటికే 60 శాతం మించడం లేదు. దీంతో రీజియన్‌లోని అనేక మంది డ్రైవర్లు, సిబ్బంది విధులకు కూడా హాజరుకాలేని దుస్థితి నెలకొంది. విధులకు రానందున వారికి వేతనం తక్కువ మొత్తంలో వస్తుండడంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు.

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోంది. మొదట రాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులను ప్రారంభించాక ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించడం కొంత ఊరట కలిగించే విషయమే. సాధారణ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్యలో 60 శాతం వరకు ఉంటోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య ఎంత ఉంటుందనే విషయం సర్వీసులు ప్రారంభించాక తెలియనుంది. ప్రయాణికుల రాకపోకలనుబట్టి సర్వీసుల సంఖ్య క్రమంగా పెంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details