తెలంగాణ

telangana

ETV Bharat / state

Short Flights: త్వరలో చిన్న విమానాలు.. సన్నద్ధత కోసం కేంద్రం లేఖ

త్వరలో వరంగల్‌ నుంచి వైమానిక సేవల ప్రారంభ తేదీ అధికారికంగా వెల్లడి కానుంది. వరంగల్​ నుంచి త్వరలో 19 సీట్ల చిన్న విమానాలను నడిపించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.

Short Flights
త్వరలో చిన్న విమానాలు

By

Published : Sep 27, 2021, 7:31 AM IST

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మామునూరు విమానాశ్రయం నుంచి త్వరలో 19 సీట్ల చిన్న విమానాల (Short Flights)ను నడిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించి, విస్తరించేందుకు, క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తర్వాత వరంగల్‌ నుంచి వైమానిక సేవల ప్రారంభ తేదీ అధికారికంగా వెల్లడి కానుంది. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌కు వచ్చినపుడు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వినతి మేరకు వరంగల్‌ నుంచి త్వరలో చిన్న విమానాల (Short Flights) సేవలను ప్రారంభిస్తామని, బసంత్‌నగర్‌, కొత్తగూడెం, దేవరకద్రలకు సైతం వాటిని విస్తరిస్తామని, ఆదిలాబాద్‌లోని విమానాశ్రయాన్ని వాయుసేన ద్వారా నడిపిస్తామని సింధియా హామీ ఇచ్చారు. దిల్లీలో తమ శాఖ సమీక్ష సమావేశంలో వరంగల్‌లో వైమానిక సేవలకు నిర్ణయించినట్లు తెలిసింది.

తొలుత 29 సీట్ల విమానాలు

చిన్న విమానాశ్రయాల్లో నడిపేందుకు వీలుగా హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌(Hindustan Aeronautics Limited) సంస్థ సివిల్‌ డార్నియర్‌ 228 (Civil Dornier 228) విమానాలను తయారు చేస్తోంది. వీటిని కొని నిర్వహించేందుకు పౌరవిమానయాన శాఖ, హెచ్‌ఏఎల్‌(Hindustan Aeronautics Limited) ల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. 19 సీట్లతో తక్కువ రన్‌వేతో టేకాఫ్‌, ల్యాండ్‌ అయ్యేలా ఇవి సిద్ధమవుతున్నాయి. వీటి నిర్వహణ వ్యయం తక్కువ. తొలుత అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ప్రారంభించి, తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలకు, జిల్లాలకు వీటిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.

నిజాం పాలనలో 1930లో మామునూరు విమానాశ్రయం ప్రారంభమైంది. 1987 వరకు అక్కడ విమానాలు నడిచాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనల్లో వరంగల్‌ పేరును ముందుగా చేర్చింది. ఇక్కడి మెగాజౌళి పార్కులో కొరియాకు చెందిన యంగ్‌వన్‌, కేరళకు చెందిన కైటెక్స్‌ కూడా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. వైమానిక సేవలను ఈ సంస్థలు కోరడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. దాదాపు 1160 ఎకరాల భూమితో. 1829 మీటర్ల రన్‌వేతో నడపడానికి సిద్ధంగా ఉంది. ఏర్పాట్లు ప్రారంభిస్తే నెల నుంచి రెండు నెలల్లో దీనిని సిద్ధం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:cm kcr delhi tour: ఉప్పుడు బియ్యం కొనుగోలుపై గోయల్‌తో కేసీఆర్​ చర్చ.. అమిత్​షాతో ప్రత్యేకంగా భేటీ

ABOUT THE AUTHOR

...view details