sharmila comments on cm kcr: తెరాసకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల ఆరోపించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో మొదలై లింగాల, రంయ్యపల్లి మీదుగా సాయంత్రం మడ్డపల్లికి చేరుకున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, మహిళలు ఆమెకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
అధికార పార్టీపై విమర్శలు :ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..' ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కనీసం ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. దళిత బంధు పేరుతో దగ్గరి అనుచరులకు దోచి పెడుతున్నారని' అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక కొత్త పథకం తీసుకురావటం కేసీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదుకదా.. తాగుబోతుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మండిపడ్డారు. గడిచిన ఎనిమిదేళ్లలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మాత్రం పంటలను పరిశీలించలేదని, పరిహారం చెల్లించిన దాఖలాలు లేవని ఆరోపించారు.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపై పెడతామని హామీ ఇచ్చారు.