వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం నాలుగు దశాబ్దాల క్రితం వేలాది మంది చేనేత కార్మికులతో కళకళలాడేది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం... ఉత్పత్తుల తయారీకి మూడు సరుకు ధరలు పెరగడం... గిరాకీ తగ్గడం... వంటి పలు కారణాలతో పూట గడవడమే కష్టంగా మారింది. చేసేది లేక పొట్ట చేత పట్టుకొని భీమండి, సూరత్ పట్టణాలకు వలస బాట పట్టారు నేతన్నలు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు అక్కడే జీవనం కొనసాగించారు. అక్కడి బట్టల తయారీ మిల్లుల్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం వల్ల నేతన్నలు రాష్ట్రంలో సగర్వంగా జీవించాలన్న ఆలోచనతో కొందరు స్వగ్రామానికి తరలివచ్చారు.. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని గ్రామంలోనే జీవించారు.
భరోసా ఇచ్చారు... తిరిగొచ్చారు
జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అప్పటి రాష్ట్ర మంత్రుల బృందం 2014లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో పర్యటించారు. వారిలో జిల్లాకు చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వలస తెలంగాణ కార్మికులను కలిశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు సబ్సిడీ, మార్కెటింగ్ సౌకర్యం, రుణ సాయంతో పాటు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించడంతో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గత కొన్నేళ్లుగా అక్కడ సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకొని ఉన్న ఉద్యోగాలను వదులుకొని నేతల మాటలను నమ్మి వచ్చిన కార్మికులకు నిరాశే మిగిలిందని నేతన్నలు వాపోతున్నారు.
రోడ్డున పడే పరిస్థితి
పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వ తోడ్పాటు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం వల్ల అప్పులు చేసి మరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నామని వారు తెలిపారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని మాటిచ్చిన నాయకులు ఇప్పుడు వెళితే పట్టించుకోవడంలేదని... ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. అప్పుడు వారు చేసిన మోసానికి ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.