తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ తర్వాత ఆ స్థాయిలో హుజూర్​నగర్​కు నామినేషన్లు

హుజూర్​నగర్ ఉపఎన్నికకు చివరి రోజు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. గడువు సమయం ముగిసిన తర్వాత కూడా మూడు గంటల పాటు ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఆర్వో కార్యాలయంలోకి వచ్చిన వారికి టోకెన్లు జారీ చేసి పత్రాలు స్వీకరించారు.

ఆ స్థాయిలో హుజూర్​నగర్​కు నామినేషన్లు

By

Published : Oct 1, 2019, 5:58 AM IST

Updated : Oct 1, 2019, 1:31 PM IST

ఆ స్థాయిలో హుజూర్​నగర్​కు నామినేషన్లు

హుజూర్​నగర్ ఉపఎన్నికకు చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబరు 23 నుంచి 29 వరకు 9 నామినేషన్లు దాఖలు కాగా... చివరి రోజైన సోమవారం నాడు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి. ఒక్క రోజే 76 మంది పత్రాలు దాఖలు చేసినట్లు అధికారులు తెలియజేశారు. తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపా, సీపీఎం, స్వతంత్రులతో పాటు వివిధ సంఘాల తరఫున అభ్యర్థులుగా పత్రాలు అందజేశారు. చిన్న పార్టీలతో పాటు రాష్ట్ర సర్పంచుల సంఘం, జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఓయూ ఐకాస, భూ బాధితులు, నిరుద్యోగులు సహా... వివిధ జిల్లాల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.

చివరిరోజే అందరూ..

తెరాస నుంచి శానంపూడి సైదిరెడ్డి... ఆయనకు మద్దతుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య ఆర్వో కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, భాజపా నుంచి కోటా రామారావు, తెదేపా తరఫున చావా కిరణ్మయి, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్, బీఎల్ఎఫ్ నుంచి మేడి రమణ... నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ప్రారంభం నాటి నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల చివరి రోజే అందరూ ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు.

వివిధ పార్టీల సమావేశాలు..

తెదేపా, భాజపా, సీపీఎం హుజూర్​నగర్​లో ర్యాలీ నిర్వహించగా... నామినేషన్ ముగిసిన తర్వాత ఆయా పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్... పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్​లో అత్యధిక నామినేషన్లు దాఖలు కాగా... ఆ స్థాయిలో ఇపుడు హుజూర్​నగర్​లో నామపత్రాలు వచ్చాయి.

ఎలాంటి అవాంతరాలు లేకుండా..

మధ్యాహ్నం 12 తర్వాత ప్రారంభమైన అభ్యర్థుల రాక... గడువు సమయం 3 దాటినా... మరో మూడు గంటల పాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు వరుస కొనసాగింది. ముందుగా సెట్లను లెక్కించిన అధికారులు... పత్రాలు అందజేసిన అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారన్న కారణంతో... పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎం-3 యంత్రాలు..

పోటీలో ఎక్కువ స్థాయిలో అభ్యర్థులు ఉండటం వల్ల ఎం-3 యంత్రాలను ఉపయోగిస్తామని జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థులను బట్టి... ఒక్కో కంట్రోల్ యూనిట్ కు 5 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: హుజూర్​నగర్​లో గెలుపు... రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు

Last Updated : Oct 1, 2019, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details