విద్యుత్ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన చిన్నారులకు దాతలు చేయూతనందిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్... బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందజేస్తానని భరోసానిచ్చారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో మానుక వెంకటేశ్ గౌడ్, రేవతి దంపతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గత నెల 2న మృతిచెందారు. వీరికి ఇద్దరు చిన్నారులు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను నానమ్మ, తాతయ్య.. అమ్మనాన్నలుగా మారి పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి ఆర్థిక ఇబ్బందులు తెలియజేస్తూ.. ఈనాడు, ఈటీవీ భారత్ వీరి దీనగాథను వెలుగులోకి తీసుకొచ్చింది.