ఐఐటీ భవిష్యత్ పరిశోధకులపై.. 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్' పేరుతో కార్యక్రమం Future Innovators Program at IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్.. భవిష్యత్ పరిశోధకులపై దృష్టి సారించింది. పాఠశాల నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్' పేరిట ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఆవిష్కరణలకు సంబంధించి ఆలోచనలు పంపాలని ఆహ్వానించింది.
'ఇన్వెంటింగ్.. ఇన్నోవేటింగ్.. ఇన్ టెక్నాలజీ ఫర్ హ్యుమానిటీ' అనే విధానాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఐఐటీ హైదరాబాద్.. వందల ఆవిష్కరణలతో పరిశోధనలకు చిరునామాగా నిలుస్తోంది. ఇందులో దేశంలో మరే ఐఐటీలో లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను ఆకర్షించేలా సదుపాయలు కల్పిస్తున్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ పార్క్, ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రూ. కోట్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, మౌలిక వసతులు సమకూర్చారు. నిపుణులు, పారిశ్రామిక వేత్తల మెంటర్‌షిప్ సైతం యువ పరిశోధకులకు అందిస్తున్నారు.
భవిష్యత్ పరిశోధకులను సైతం ప్రోత్సహించేలా..: వీటిని ఉపయోగించుకుని వందల మంది పరిశోధకులు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. భవిష్యత్ పరిశోధకులను సైతం ప్రోత్సహించేలా.. వారి ఆలోచనలను ఆవిష్కరణ రూపంలోకి తీసుకువచ్చేలా 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్' పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. ఐఐటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరుకు చదివే విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించారు. విద్యార్థులు ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచన గురించి 500 పదాలకు మించకుండా నివేదికతో పాటు 3 నిమిషాల నిడివి మించకుండా ప్రాజెక్ట్ వీడియో తీయాలి.
కృష్ణ ఎల్ల చేతుల మీదుగా బహుమతులు: వాటిని మెయిల్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు ఐఐటీ హైదరాబాద్‌కు పంపించాలి. ఒక్కో బృందంలో గరిష్ఠంగా ఐదుగురు విద్యార్థులు, ఒక్కో పాఠశాల నుంచి గరిష్ఠంగా ఇద్దరు.. ప్రతిపాదనలు పంపేందుకు ఐఐటీ అవకాశం కల్పించింది. ఉత్తమ ఆలోచనలు ఎంపిక చేసి ఏప్రిల్ 13వ తేదీన ఐఐటీ ప్రాంగణంలో ప్రదర్శించనున్నారు. ప్రదర్శించిన వాటిలో అత్యుత్తమ ఆవిష్కరణలు ఎంపిక చేసి ఐఐటీ హైదరాబాద్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల చేతుల మీదుగా వారికి బహుమతులు అందిస్తారు. ఆలోచనల్ని ఆవిష్కరణలుగా మార్చడానికి పూర్తి స్థాయిలో సాయం అందించనున్నారు.
ఇవీ చదవండి: