South Central Railway Record level works: 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే.. జోన్ రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 344 ట్రాక్ కి.మీల మేర మౌలిక సదుపాయాలను జోడించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టిన ద.మ.రైల్వే వాటిని నిర్దేశించిన సమయంలోగా వేగవంతంగా పూర్తి చేయడానికి కచ్చితమైన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించగలిగింది. జోన్‌లో గతంలో ఏ ఆర్థిక సంవత్సరంలో లేనివిధంగా ఈ సారి జోన్ నెట్‌వర్క్‌కు అదనంగా 83 కి.మీలు నూతన రైల్వే లైన్లు, 197 కి.మీల డబుల్ రైల్వే లైన్లు, 64 కి.మీల మూడో రైల్వే లైన్ల పనులను పూర్తి చేసి ప్రారంభించడంతో అత్యధికంగా 344 కి.మీల పనులు పూర్తయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
83 కి.మీల నూతన రైల్వే లైన్ల పనులు పూర్తి చేసిన సెక్షన్లలో... భద్రాచలం- భనవపాలెం మధ్య 40.2 కి.మీలు, గజ్వేల్- కోడకండ్ల మధ్య 12.2 కి.మీలు, అక్కన్నపేట- మెదక్ మధ్య 17.3 కి.మీలు, మాగనూర్- మక్తల్ మధ్య 13.3 కి.మీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 197 కి.మీల డబుల్ రైల్వే లైను పనులు పూర్తి చేసిన సెక్షన్లలో ఉందానగర్- షాద్‌నగర్ మధ్య 29.7 కి.మీలు, గొల్లపల్లి- మహబూబ్‌నగర్ మధ్య 25.7 కి.మీలు, విజయవాడ- ఉప్పలూరు మధ్య 17 కి.మీలు, నర్సాపూర్- భీమవరం- ఆరవల్లి మధ్య 48.2 కి.మీలు, గుండ్లకమ్మ- దొనకొండ మధ్య 23.9 కి.మీలు, ఎద్దులదొడ్డి- మద్దికెర మధ్య 22.5 కి.మీలు, కల్లూరు -గుత్తి మధ్య 26.4 కిమీలు, మోటుమర్రి వద్ద 2.1 కిమీల బైపాస్ లైన్, 1.5 కిమీల విజయవాడ బల్బ్ లైన్ ఉన్నాయి.