High Court on Hetero Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ఖానామెట్ గ్రామంలోని రూ.కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని లీజు పేరుతో నామమాత్రపు ధరకు హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 50ను సవాల్ చేస్తూ రైట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ, డాక్టర్ ఊర్మిళ పింగ్లేలు దాఖలు చేసిన వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. భూ కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు. జడ్చర్లలో ఇదే హెటిరో గ్రూపునకు జరిగిన భూకేటాయింపులపై సీబీఐ కేసును ఎదుర్కొంటోందని తెలిపారు. తక్కువ ధరకు భూమిని కేటాయిస్తూ దానికి కారణాలు ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు. ఇదే ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రికి కేటాయింపులు జరిపినందున అదే ప్రాతిపదికన ఇప్పుడు కేటాయించడం సరికాదన్నారు.
Cancer Hospital in Serilingampally: బసవతారకం ఆసుపత్రికి 30 ఏళ్ల క్రిందట కేటాయింపు జరిగిందని.. అప్పటి ధరలకు ఇప్పుడు కేటాయింపు సరికాదన్నారు. ఏడాదికి రూ 1.47 లక్షల నామమాత్రపు ధరతో 33 ఏళ్లకు లీజుకు ఇచ్చిందని.. దీన్ని మరో 30 ఏళ్లకు పొడిగించవచ్చన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.750 కోట్లకుపైగా విలువజేన భూమిని కేవలం రూ.50 కోట్ల లీజుకే ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు.
ఈ క్రమంలో హెటిరో తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది.. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో 500 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి 1400 పడకలకు పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో 25 శాతం మందికి ఉచితంగా వైద్యం అందిస్తారని, 2 వేల మందికి వసతి కల్పించేలా ధర్మశాల కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంపన్నులు పన్నులు చెల్లిస్తారని, ఆ సొమ్ముతో ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తునాయని పేర్కొనగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పేదలు పరోక్షంగా పన్నులు చెల్లిస్తున్నారని పేర్కొంది.