Farmhouses became base to crimes in Telangana : కనుచూపుమేరలో కనిపించని పోలీసు గస్తీ.. సాయంత్రం దాటితే మనిషి జాడ కనిపించని కారు చీకటి.. పోలీసు బండి వస్తోందంటే చాలు అప్రమత్తం చేసే మనుషులు.. ఇవే అదనుగా ఫాంహౌస్‌లు నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డ్రగ్స్, గంజాయి, వ్యభిచారం, హుక్కా, బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్, ముజ్రా, రేవ్ పార్టీలు, అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ మద్యం.. ఇదేదో నేరాల జాబితా కాదు.. నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో వారాంతాల్లో జరిగే తంతు.
వారాంతంలో మత్తులో మునుగుతున్న విద్యార్థులు: వారాంతమైతే చాలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ శివారువైపు చూస్తున్నారు. నగరంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుండటంతో.. అందరి అడ్డా ఫాంహౌస్‌లకు మారిపోయింది. సరిపడా మద్యం, మాదకద్రవ్యాలు, సరంజామా తెప్పించుకుని గడుపుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌కు అలవాటుపడ్డ కళాశాలల విద్యార్థులు వారాంతాల్లో వచ్చి మత్తులో మునిగితేలుతున్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు సెటిల్‌మెంట్లతోపాటు.. తలదాచుకోవడానికి వీటిని వాడుకుంటున్నారు. జూబ్లిహిల్స్‌లో యువతి అత్యాచారం కేసులో నిందితులు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నారు.
డబ్బు ఇస్తే చాలు ఏం చేసినా పట్టించుకోరు: సైబరాబాద్ పరిధిలోని మెయినాబాద్, షామీర్‌పేట, మేడ్చల్, కొత్తూరు రాచకొండ పరిధిలో కీసర తదితర ప్రాంతాల్లో దాదాపు 15 వేల దాకా ఫాంహౌస్‌లు ఉన్నాయి. డబ్బు కడితే చాలు ఏం చేసినా పట్టించుకోవడం లేదు. పెద్దఎత్తున హుక్కా, మద్యం, జూదం ఆడుతున్నా.. యువతుల్ని తీసుకొచ్చి అర్థరాత్రి వేళ చిందులేస్తున్నా చూసీచూడనట్లు ఉంటున్నారు. వీటికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఫోన్ కొడితే చాలు అన్నీ తలుపు దగ్గరకు తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.