ఈ వీడియోలోని ఈ దృశ్యం సిరిసిల్ల పట్టణంలో వరదల ఉద్ధృతిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఓ వ్యక్తి తన వాహనాన్ని తాళ్లతో కట్టేశాడు. వాహనాన్ని ఎవరైనా కొట్టేస్తారని కాదు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోకుండా ఉండాలని.. పట్టణంలోని వీధులు నదులను తలపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది.
Car tied with rope: కారును కట్టేశాడు... కొట్టేస్తారని కాదు.. కొట్టుకుపోతుందని..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. వరద ఉద్ధృతికి పట్టణంలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోకుండా వాహన యజమానులు వాటిని తాళ్లతో కడుతున్నారు.
రద్దీగా ఉండే పాతబస్టాండ్, వెంకంపేట, ప్రగతినగర్, పెద్దబజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. భారీ వరదతో సిరిసిల్లలో జనజీవనం స్తంభించింది.
ఇదీ చూడండి:KTR: 'సహాయక చర్యల కోసం... సిరిసిల్లకు డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నాం'