Protests in Telangana University : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దీంతో వంట, పారిశుద్ద్యం, ఇతర విభాగాలపై ప్రభావం పడింది. వంట చేసే సిబ్బంది విధులకు రాకుండా ఆందోళనలో పాల్గొనడంతో రెండు రోజులుగా విద్యార్థులు ఆహారం కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు సైతం ఆందోళన బాట పట్టారు.
అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. గత నెలలో సైతం అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తింది. నెల ప్రారంభమై పదిహేను రోజులవుతున్నా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ప్రతి నెలా ధర్నాలు చెయ్యాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11గంటలకు అల్పాహారం చెయ్యాల్సి వచ్చింది. సాయంత్రం 5.30గంటలకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. సమస్య పరిష్కరించాలంటూ వర్శిటీకి వచ్చిన వీసీ రవీందర్గుప్తాను విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటూ సిబ్బంది, భోజనం ఎప్పుడు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు.