BRS MLC Kavitha Challenge to MP Aravind : రోడ్లు భవనాలశాఖల నిధుల్లో కొన్నింటిని కవితకి అప్పగిస్తున్నారంటూ... బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను... 24 గంటల లోపు ఎంపీ అర్వింద్ నిరూపించాలని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. ఆ ఆరోపణలు నిరూపించకుంటే నిజామాబాద్‌లోని పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha Latest Comments : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్బంగా ఎంపీ అర్వింద్ తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అర్వింద్‌కు 24గంటల సమయం ఇస్తున్నానని తేల్చి చెప్పారు. అభివృద్ధి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. డీఎస్ ఉన్నప్పుడు నిజామాబాద్‌లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పూర్తి చెయ్యలేకపోయారని... అలాగే నిజామాబాద్ బైపాస్ రోడ్డు కూడా పూర్తి చెయ్యలేకపోయారని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ ఎలాంటి అవినీతి లేకుండా పూర్తి చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
నా భర్త పేరు తియ్యాల్సిన అవసరం ఏముంది : తాను ఎంపీగా ఉన్నప్పుడు... ఒక్క జిల్లాకే రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చానని కవిత గుర్తు చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు తీసుకొచ్చినా... అర్వింద్ తెచ్చినట్లు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు నాన్న, అన్న రాజకీయాల్లో ఉండటం వల్లే ఇన్నేళ్లు సహించానన్న ఎమ్మెల్సీ కవిత.. తన భర్త పేరు వాడటం సరికాదని పేర్కొన్నారు. అదేవిధంగా తన భర్త పేరు తియ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.