నిజామాబాద్ జిల్లాలో దాదాపు అన్ని పురపాలక సంఘాల్లో డివిజన్, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం చేపట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 15, 16 తేదీల్లో వెలువడే అవకాశం ఉండటంతో అధికారులు బ్యాలెట్ పెట్టెలను సమకూర్చుకొనే పనిలో పడ్డారు. ఎక్కడెక్కడ పెట్టెలు ఉన్నాయో వాటి లెక్కలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
800 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 10న అధికారులు ప్రకటించనున్నారు. 14న పీఎస్ వారీగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికలు బ్యాలెట్ పేపరు ద్వారా నిర్వహించనున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లను మాత్రమే ఉండేలా చూస్తున్నారు.
12, 13 తేదీలలో రిజర్వేషన్లు
ఓటర్ల తుది జాబితా ప్రకటించేలోపు ఈ నెల 12, 13 తేదీల్లో వార్డులు, డివిజన్లలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆశావహులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రాజకీయ వేడి రాజుకోనుంది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లను పురపాలక సంఘాల్లో నిర్ణయించనుండగా మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లు మాత్రం రాజధానిలోని సీడీఎంఏ నిర్ణయించనుంది.
బృందాల ఏర్పాటుకు సన్నాహాలు
నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తోంది. దీనికోసం ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీ అక్రమ రవాణాను అరికట్టేందుకు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడే లోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
ఇదీ చదవండిః తెలంగాణ విత్తనాలు...ఐరోపా దేశాలకు ఎగుమతి