Irregularities in Ration Dealers Selection: నారాయణపేట జిల్లాలో వివిధ మండలాల్లో ఇటీవల చేపట్టిన రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అనర్హులకు డీలర్ షిప్ కట్టబెట్టారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని 10 మండలాల్లోని 31 గ్రామాల్లో రిజర్వేషన్ల వారీగా రేషన్ డీలర్ల నియామకాలు చేపట్టారు. అందుకోసం 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు మౌఖిక పరీక్షకు కేటాయించారు. రాత పరీక్షల్లో కనీసం 32 మార్కులు సాధించిన అభ్యర్థులను క్వాలిఫైడ్ అభ్యర్థులుగా ఎంపిక చేసి.. ఒక్కో డీలర్ స్థానానికి అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురిని ఇంటర్వ్యూలకు పిలిచారు.
రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూ పేరుతో అధికంగా మార్కులు వేసి.. వారికి నియామక పత్రాలు ఇచ్చారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలోనూ అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రశ్నలు మాత్రమే వేశారని.. అన్నింటికీ సరైన సమాధానాలిచ్చామని అంటున్నారు. అన్ని అర్హతలు ఉండి, మంచి మార్కులు సాధించినా ఇంటర్వ్యూల్లో మాత్రం తాము నెగ్గలేదని అధికారులు చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పాటు అభ్యర్థులతో కుమ్మక్కైన అధికారులు అనర్హులకు డీలర్ షిప్ కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా డీలర్‌షిప్ కేటాయింపు: గతంలో డీలర్‌గా పని చేసి సస్పెండైన వ్యక్తుల కుటుంబాలకు మళ్లీ డీలర్ షిప్ అప్పగించకూడదు. కానీ మద్దూరు మండలంలోని ఓ గ్రామంలో డీలర్‌గా పని చేసి సస్పెండైన వ్యక్తి కుటుంబ సభ్యురాలికే తిరిగి డీలర్ షిప్ అప్పగించారు. ఆవాస గ్రామాల్లో నివాసముండే వారికి డీలర్ షిప్ ఇవ్వకూడదు. మాగనూరు మండలంలోని గ్రామ పంచాయతీలో అర్హులైన అభ్యర్థులకు ఇవ్వకుండా ఆవాస గ్రామంలోని వారికి డీలర్ షిప్ అప్పగించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సుమారు 10 గ్రామాల అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.
మరోసారి అధికంగా మార్కులు వచ్చిన అభ్యర్థులను పిలిచి కలెక్టరే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నారాయణపేట ఆర్డీవో రామచందర్‌ను వివరణ కోరగా.. నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుల్లో నిజముంటే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి కొన్ని గ్రామాల నుంచి ఫిర్యాదులు అందినా.. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.