Nagarjunasagar project spillway repair work గతంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న నాగార్జునసాగర్ స్పిల్‌వే మరమ్మతు పనులు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 26 గేట్ల కింది భాగంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ భారీ గుంతల వల్ల ప్రాజెక్టుకూ ప్రమాదం ఏర్పడవచ్చన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతులకు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించగా.. గత నెలలో రూ.20 కోట్లు మంజూరయ్యాయి.
ఇప్పటికే 22 భారీ గుంతలను గుర్తించిన ఇంజినీరింగ్ సిబ్బంది తొలి దశలో 11 గుంతలను పూడ్చే పనులు చేస్తున్నారు. వీటికి సమానంగా డ్రిల్లింగ్ చేసిన అనంతరం కాంక్రీట్ ద్వారా గుంతలను పూడ్చుతున్నారు. ఈ పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినా.. అప్పటి వరకూ పూర్తవుతాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా ప్రాజెక్టుకు జూన్ నెలాఖరు నుంచి నుంచి వరద మొదలవుతుంది. వరద మొదలైతే పనులు సాగవు. ఈ నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే జులై వరకు పూర్తికావన్న అనుమానాలున్నాయి. అయితే అధికారులు మాత్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని...ఎగువ నుంచి వరదలు మొదలుకాకముందే జూన్ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు.